వై.ఎస్.ఎస్. అభ్యర్థన — జనవరి 2024

3 జనవరి, 2024

జన్మోత్సవం సందర్భంగా ప్రత్యేక సమర్పణ చేయండి

రాంచీ ఒక గొప్ప సంస్థ…ప్రాచ్య పాశ్చాత్య దేశాల నుండి వచ్చే యోగదా యాత్రికులకు ఇది మక్కా వంటి ఒక పుణ్యక్షేత్రం.

— శ్రీ శ్రీ పరమహంస యోగానంద

గురుదేవులు శ్రీ శ్రీ పరమహంస యోగానందగారి ఆవిర్భావ దినోత్సవ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. మన ప్రియతమ గురుదేవుల పట్ల హృదయపూర్వక భక్తిని మాతో కలిసి వ్యక్తపరచడానికి మేము మిమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాము, వారి దివ్య ఆశీర్వాదాలు మన జీవితాలకు ఉన్నతిని చేకూరుస్తాయి. పరమహంసగారి ఆదర్శప్రాయమైన జీవితము, భూమిపై ఆయన చేసిన బృహత్కార్యాలు అసంఖ్యాకమైన సత్యాన్వేషకులకు తమ విశ్వగృహం వైపు చేసే ప్రయాణంలో స్ఫూర్తినిచ్చాయి, ఈ రోజుకి కూడా స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి. వారి జీవిత పథాలను అమోఘమైన జ్ఞానం, మార్గదర్శనాలతో ప్రకాశింపజేస్తున్నాయి.

“మన ప్రియమైన గురుదేవుల దివ్య సాన్నిధ్యాన్ని ఒకప్పుడు పొందిన స్థలమైన ఈ రాంచీ ఆశ్రమం యొక్క పవిత్ర ప్రాంతాలలో అడుగు పెట్టడమంటే అది నిజంగా ఒక అద్భుతమైన ఆశీర్వాదం అవుతుంది. ఈ ప్రదేశంలోని ప్రతి కోణము, గౌరవనీయులైన మన సన్యాసులు నిర్వహించిన ఆత్మీయ సత్సంగాలు మరియు ప్రబోధాత్మక తరగతుల మధుర స్మృతులను కలిగి ఉన్నది. మనం ఎన్నో ఏళ్లుగా ఇక్కడి ప్రదేశాలలో — మైదానం, అతిథి గృహం, మరియు ఆడిటోరియంలో — సంగమాలు మరియు ఏకాంత ధ్యాన వాసాల సమయాలలో ఒక సమైక్య ఆధ్యాత్మిక కుటుంబంగా ధ్యానించడానికి మరియు మధుర సహవాసం పొందడానికి చేరుకునేవాళ్ళం.

ఆయా కార్యక్రమాల సందర్భంగా ప్రవహించిన మన గురుదేవుల జ్ఞాన-నదిలో నిమగ్నమై సాంత్వనను మరియు మార్గదర్శకత్వాన్ని మనం ఇక్కడ పొందడం జరిగింది. మన ఆధ్యాత్మిక మార్గాన్ని కొత్త ఉత్సాహంతో పునరుద్ధరించుకోవడానికి అమూల్యమైన అవకాశాన్ని మనం తెలుసుకున్నాము. ఓహో! మన హృదయాలను స్పృశించి, మన ఆత్మలను ఉన్నతిపరచి, కాలానికి మరియు స్థలానికి మించిన బంధాలను ఏర్పరచిన ఆ దివ్య క్షణాలను మనం ఎలా భద్రపరచుకోగలం.”

— యు. ఎస్., ఢిల్లీ

ఈ పవిత్రమైన సందర్భాలలో, తమ విరాళాల ద్వారా చేయూత నందించేందుకు యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా (వై.ఎస్.ఎస్.) ఏవైనా ప్రత్యేక కార్యక్రమాలని చేపడుతోందా అని భక్తులు తరచుగా అడుగుతూ ఉంటారు. ఈ సంవత్సరం అనేకమైన అటువంటి అవకాశాల గురించి మేము మీతో పంచుకోవాలని అనుకుంటున్నాము. గురుదేవుల రాంచీ ఆశ్రమంలోని సౌకర్యాలను పునరుద్ధరించడం, నవీకరించడంలో మీరు సహకరించవచ్చును.

సందర్శించే భక్తుల కొరకు వివిధ సౌకర్యాల నవీకరణను మేము చేపట్టే సందర్భంలో, మీ మద్దతును మేము వినమ్రంగా అభ్యర్థిస్తున్నాము. ఈ దివ్య కార్యానికి మీరు తోడ్పడడం ద్వారా, అనేక ఆత్మలు సాంత్వన, ప్రేరణ, దివ్య ప్రేమ, మరియు తమ స్వంతం అనే భావనను పొందిన ఈ పవిత్ర ఆశ్రమాన్ని సంరక్షించడంలోనూ మెరుగుపరచడంలోనూ మీరు సహాయపడగలరు. మనమందరం కలిసి, మన చిత్తశుద్ధి, కృతజ్ఞత మరియు మన భాగస్వామ్య ఆధ్యాత్మిక ప్రయాణం పట్ల నిబద్దత ద్వారా మన గురుదేవుల వారసత్వాన్ని కాపాడుకుందాం.

ప్రధాన అతిథి గృహం యొక్క నవీకరణ

1959లో స్థాపించబడి, గౌరవనీయులైన మన పూర్వపు అధ్యక్షురాలు మరియు సంఘమాత శ్రీ శ్రీ దయామాతచే శంఖుస్థాపన చేయబడిన రాంచీ ఆశ్రమంలోని ప్రధాన అతిథి గృహం మొదట, యోగదా సత్సంగ బ్రహ్మచర్య విద్యాలయం (పాఠశాల) మరియు మహావిద్యాలయం (కళాశాల) యొక్క విద్యార్థులకు వసతి గదులుగా మరియు తరగతి గదులుగా ఉపయోగించబడేది. కాలక్రమేణా ఇది, సందర్శనార్ధం వచ్చే భక్తుల వసతి కొరకు ఒక అతిథి గృహంగా మార్చబడినది. ఈ భవనం 60 సంవత్సరాలకు పైబడినది కావడం వలన, ప్రస్తుతం దీనికి పెద్దఎత్తున మరమ్మతులు మరియు అతిథి గదులన్నిటికీ ఆధునిక ప్రమాణాలకు సరిపోయేలా గణనీయమైన మార్పులు అవసరమై ఉన్నది.

అతిథి గృహం బయట ఉన్న లిఫ్ట్ యంత్ర భాగం
కొత్తగా అమర్చబడిన లిఫ్ట్
YSS-Appeal-January-2024-Main-Guest-House-Construction-Image
రెండవ అంతస్తులో పునర్నిర్మాణ పనులు
నవీకరించిన అతిథి గదుల రూపకల్పన యొక్క నమూనా

ఈ క్రింద పేర్కొన్న నవీకరణ పనులు చేయవలసి ఉన్నది:

  • రెండవ అంతస్తులోని పెద్ద డార్మిటరీలను మరియు ఉమ్మడి స్నానపు సౌకర్యాలను, అనుబంధ స్నానపు సౌకర్యాలుగల వ్యక్తిగత లేదా కుటుంబ గదులుగా మార్చడం. ఈ ప్రక్రియలో 17 అతిథి గదులను మేము జోడిస్తున్నాము. సందర్శకులకు ఈ కొత్త గదులు డార్మిటరీలలో లేని సౌకర్యాలను మరియు ఏకాంతాన్ని అందిస్తాయి.
  • మరమ్మత్తు పనులు: అనేక గదుల్లో వర్షపు నీరు కారడంతో పాటు, చెడిపోవడం వల్ల ఏర్పడే భవన సమస్యలను సరిచేయడానికి, విస్తృతమైన మరమ్మత్తులు అవసరం.
  • వృద్ధుల కోసం లిఫ్ట్: వృద్ధులకు సైతం పై అంతస్తులలో బస ఏర్పాటు చేసేందుకు వీలుగా మేము ఒక లిఫ్ట్ ను స్థాపించడం జరిగింది. దీని వలన వారికి క్రింది అంతస్తు గదులలో మాత్రమే వసతి కల్పించడమనే పరిమితి తొలగుతుంది.
  • గదుల పునరుద్ధరణ: ప్రస్తుత అతిథి గదులలోని ఉపకరణాలు (ఫర్నిచర్) మరియు అమరికలు పాతకాలం నాటివి. నవీకరణ ప్రణాళికలో భాగంగా, అన్ని గదుల్లో నాణ్యమైన ఫర్నిచర్ ఉంచబడుతుంది, ఇందులో చదువుకునే బల్లలు మరియు కుర్చీలు, సౌకర్యవంతమైన విశ్రాంతినివ్వగల పడకలు, మరియు ప్రశాంతకర అలంకరణ సామగ్రి ఉంటాయి. ప్రశాంతమైన రంగులు మరియు మృదువైన కాంతి ప్రసారం వంటి అంశాలను కలపడం ద్వారా, అంతర్ముఖత మరియు ఆధ్యాత్మిక ఉన్నతిని కలుగజేసే వాతావరణాన్ని ఈ గదులలో సృష్టించడమే మా లక్ష్యం.

ప్రాజెక్ట్ వ్యయం: 2.75 కోట్ల రూపాయలు

స్త్రీల వసతి గృహానికి రెండవ అంతస్తును జోడించడం

నిర్మాణంలో ఉన్న రెండవ అంతస్తు
పురోగతిలో ఉన్న రెండవ అంతస్తు పైకప్పు పనులు
భవనం ముందు భాగం యొక్క మార్పుచేర్పుల నిర్మాణ నమూనా

సాధనా సంగమాలు మరియు ఏకాంత ధ్యాన వాసాల సందర్భంగా స్త్రీల వసతి గృహంలోని గదుల సౌకర్యం పరిమితంగా ఉన్నందున, ఈ సమస్యను సరిదిద్దడం అత్యంత ఆవశ్యకమై ఉన్నది. ఈ సమస్యను తీర్చేందుకు 13 గదులతో రెండవ అంతస్తును జోడించాలని మా ఆలోచన. ఈ విస్తరణ మన గురు-బహెనులకు (సోదరీమణులకు) చక్కటి ఆహ్వానాన్ని మరియు సౌఖ్యమైన పరిసరాన్ని అందించి, వారు తమ ఆధ్యాత్మిక సాధనల్లో సంపూర్ణంగా లీనమయ్యేలా చేస్తుంది. పైన వర్ణించినట్లుగా, ఈ గదులు ఆధునిక గృహోపకరణాలు మరియు అంతర్గత సామగ్రితో అలంకరించబడతాయి.

ప్రాజెక్ట్ వ్యయం: 3.25 కోట్ల రూపాయలు

ఆడిటోరియం యొక్క గణనీయ నవీకరణ

మన ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య నానాటికి పెరగడం, సాధనా సంగమాలు, స్మారకోత్సవాలు వంటి ప్రత్యేక కార్యక్రమాల నిర్వహణ సందర్భంగా పెద్ద సంఖ్యలో విచ్చేసే భక్తులందరూ ప్రధాన ధ్యాన మందిరంలో ధ్యానం చేసుకోవడం సవాలుగా మారింది. పైగా, ధ్యాన మందిరం యొక్క పైకప్పు మరియు దాని నిర్మాణక్రమం, స్థిరమైన కాంతినివ్వగల అమరికలు మరియు కెమెరాలు వంటి వాటిని అమర్చడానికి అనువుగా లేనందువల్ల ప్రత్యక్ష ప్రసారం చేయడం పూర్తిగా క్లిష్టతరంగా మారింది.

ఆడిటోరియం నవీకరణ నమూనా (ప్రక్క నుంచి)
ఆడిటోరియం నవీకరణ నమూనా (లోపలి నుంచి)

ఈ అవసరాన్ని తీర్చడం కోసం, మన ఆడిటోరియం వైపు మేము దృష్టిని మళ్ళించాము – ఇది 50 సంవత్సరాలకు పైగా మన భక్తులకు సేవ చేసిన ప్రియమైన ఆధ్యాత్మిక ఆశ్రయం. ఏది ఏమైనప్పటికీ, ఆడిటోరియంకు గణనీయమైన నవీకరణ అవసరమైనదని స్పష్టమైంది.

మొట్టమొదటగా, మేము భవనం యొక్క నిర్మాణాన్ని (పైకప్పు, మొదలైన నిర్మాణ ఫ్రేమ్ వర్క్ కు సంబంధించినవి) నవీకరిస్తాము. వర్షపు నీరు లోపలకు కారడం వంటి సమస్యలను పరిష్కరిస్తూ రాబోయే సంవత్సరాలలో పటిష్ఠంగా ఉంచడం కోసం దాని నిర్మాణాన్ని తగిన విధంగా దృఢపరచడం జరుగుతుంది.

ఆ తరువాత, మేము ఆడిటోరియం యొక్క నాలుగు వైపులను గోడలతో మూసి, లోపల ఒక ప్రశాంతమైన ఆశ్రయం సృష్టించి, వర్షం, దోమలు, మరియు శబ్దాలు వంటి బాహ్య అంశాలచే కలత చెందని ఒక ప్రశాంత వాతావరణాన్ని ఏర్పాటు చేస్తాము. ఇది భక్తులకు సాధనలో ఎంతగానో సహాయపడుతుంది.

అది మాత్రమే కాదు. ఈ డిజిటల్ యుగంలో ముందడుగు వేసి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రోతలను (భక్తులను) చేరడానికి, మేము ఆడిటోరియంలో అధునాతన ఆడియో-వీడియో (శ్రవణ-దృశ్య) పరికరాలను అమర్చే యోచన కూడా చేస్తున్నాము. ఇది కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేయడానికి మనకు సహాయపడి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాధకులకు పరివర్తనకారక అనుభవాన్ని అందిస్తుంది. ప్రధాన ధ్యాన మందిరం స్థల పరిమితులు, మనకు మన ప్రియమైన గురుదేవుల లోతైన బోధనలను మన విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక కుటుంబంతో పంచుకోవడంలో ఇక ఆటంకం కలిగించదు.

ప్రాజెక్ట్ వ్యయం: 4 కోట్ల రూపాయలు

ఈ మూడు ముఖ్యమైన నవీకరణ ప్రాజెక్టులతో పాటు, మేము మరో రెండు ప్రాజెక్టులను కూడా ప్రారంభించాము.

రాంచీ ధ్యాన మందిరం సమీపంలో కొత్త శౌచాలయ సదుపాయం మరియు సిబ్బంది బస యొక్క నవీకరణ

కొత్త శౌచాలయ సదుపాయం (ముందు నుంచి)
కొత్త శౌచాలయ సదుపాయం (ప్రక్క నుంచి)

మా నిరంతర మెరుగుదలలో భాగంగా, ప్రధాన ధ్యాన మందిరం సమీపంలో ఉన్న శౌచాలయ సదుపాయాలను మెరుగుపరచడం జరిగింది. అలాగే, రోజంతా ఉద్యోగులు అందుబాటులో ఉండేందుకు సిబ్బంది యొక్క బసను నవీకరించడానికి మేము ప్రణాళికలు తయారు చేస్తున్నాం.

ప్రాజెక్ట్ వ్యయం: 50 లక్షల రూపాయలు

సేవకులు మరియు అతిథుల కోసం క్రొత్త అపార్ట్మెంట్

రాంచీ ఆశ్రమంలో గురుదేవుల కార్యాలకు అంకితమైన సేవకుల సంఖ్య పెరుగుతున్నందున, మేము ఆశ్రమానికి చాలా సమీపంలో ఉన్న బన్సాల్ ప్లాజా అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లో రెండు బెడ్రూమ్‌లు గల ఒక అపార్ట్మెంట్‌ను తీసుకోవడం జరిగింది.

ప్రాజెక్ట్ వ్యయం: 50 లక్షల రూపాయలు

మీరు అందించే సహకారం ఎంతో అభినందనీయం

గురుదేవుల యొక్క కార్యం నిరంతరం వృద్ధిపొందుతూ ఎన్నో సవాళ్లను, మరియు సేవ చేయడానికి ఎన్నో అవకాశాలను తీసుకువస్తోంది. ఈ సవాళ్లను ఆనందంగా ఎదుర్కొనేందుకు మనమందరం చేయి చేయి కలిపి, గురుదేవుల కార్యానికి మనకు చేతనైనంత మద్దతును మరియు సహాయాన్ని అందిద్దాం.

సమష్టి ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం 11 కోట్ల రూపాయలు.

సంవత్సరాల తరబడి మీ దాతృత్వం మరియు నిరంతర ప్రోత్సాహం లేకుండా, ఇప్పటివరకు మేము చేసినవాటిని సాధించలేకపోయేవాళ్ళం. సత్య మార్గం కోసం ఆకలిగొన్న అన్వేషకులకు, మన ప్రియతమ గురుదేవుల క్రియాయోగ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి వివిధ రూపాలలో మీరు చేసే అనేక విరాళాలు ఎంతో అమూల్యమైనవి.

ఈ ప్రాజెక్టులను విజయవంతంగా పూర్తి చేయడానికి మీ ప్రార్థనలతోపాటు, మీరు చేయగల సహాయం ఏదైనా ఎంతో కృతజ్ఞతతో ప్రశంసించబడుతుంది.

మేము, సన్యాసుల సమూహం మరియు గురుదేవుల ఆశ్రమాలలో సేవ చేసే సేవకులతో కలిసి, మీ ప్రేమ, ప్రార్థనలు, మరియు ఉదారమైన సహాయాలకు మా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేస్తూ, ఈ జన్మోత్సవ శుభ సందర్భంగా మీకు శాంతి మరియు ఆనందం కలగాలని ఆశిస్తున్నాము.

భగవంతుడు మరియు మన పావన గురుదేవుల నిరంతర రక్షణ సాన్నిధ్యాన్ని మనమందరం అనుభవించెదముగాక! జై గురు!

para-ornament

ఇతరులతో పంచుకోండి