2023 క్రిస్మస్ కి అధ్యక్షుల వారి లేఖ

12 డిసెంబర్, 2023

ప్రియమైన ఆత్మస్వరూపా,

పరమహంస యోగానందగారి ఆశ్రమాల నుండి మీకు మా శుభాకాంక్షలు! ఆధ్యాత్మిక వాగ్దానాన్ని ప్రసాదించే పవిత్ర ఋతువులోకి మనం ప్రవేశించేటప్పుడు ఒక సాంత్వనకారక దైవిక శాంతి మరింత బలంగా అనంతమైన కూటస్థ చైతన్యం — సృష్టిలో పరివ్యాప్తమైన భగవంతుడి ప్రేమపూర్వక, సర్వవ్యాప్త ఎరుక — నుండి వెలువడుతుంది. మనలను మనం గ్రహణశీలంగా చేసుకుంటే ఉద్ధారకారకమైన ఆ ప్రశాంత స్పందనలు మన అసలైన ఆత్మతత్వాన్ని మనకు నిశ్చితంగా అనుభూతి చెందించడం ద్వారా మనలను గాఢంగా పరిణామం చెందించగల శక్తి కలిగి ఉంటాయి. జాగృతపరిచే ఆ ఆత్మగ్రాహ్య శక్తి అనే బహుమతి — మన ప్రియతమ దివ్య పరమాత్మ ఎంతో శ్రద్ధతో చుట్టి, మీ పేరు లిఖించి తన పరిపూర్ణ సౌకుమార్యతతో మీ చేతుల్లో పెట్టాలని ఈ క్రిస్మస్ శుభ సమయంలో నేను ప్రార్థిస్తున్నాను.

“ధ్యానం కూటస్థ చైతన్యానికి ద్వారాన్ని తెరుస్తుంది” అని పరమహంసగారు అన్నారు. “మనం పట్టుదలతోనూ, సునిశితమైన అప్రమత్తతతోనూ ఉండి భగవంతుడి ప్రేమ, కాంతి మనలోని ప్రతి ఒక్కరిలో నెలకొని ఉన్న కూటస్థ చైతన్యపు వెలుగు కణం నుండి వ్యాప్తి చెందనివ్వాలి.” ఏసు భగవంతుని పట్ల ఏకైక విధేయత కలిగి ఉండి, తనకు బాహ్య కర్తవ్యాలు అనేకం ఉన్నా పక్కన పెట్టి, స్వర్గాధిపతి అయిన పరమేశ్వరునితో ధ్యాన సమాగమంలో పూర్తిగా నిమగ్నమయ్యేందుకు అవకాశాలు కల్పించుకొనేవారు. ఈ సృష్టి నాటకంలో మనము బాహ్యంగా ఏ పాత్ర పోషిస్తున్నా, ఈ ప్రపంచాన్ని విస్మరించి క్రమం తప్పకుండా మన గురువు మనకందించిన పవిత్ర ధ్యాన సాధనలను ఈశ్వరుడి కోసమైన తీవ్రతపనతో నింపి అంతర్ముఖమవడం అనే సర్వోత్కృష్ట విషయానికి మనం పూర్తి ప్రాధాన్యత నివ్వాలి.

ఈ యుగానికి క్రియాయోగ శాస్త్రమనే అమూల్య నిధిని అందించాలని సంకల్పించినవారు ఏసు మరియు మహావతార బాబాజీ. క్రియాయోగ ప్రక్రియలు మరియు తత్సంబంధిత జీవనవిధానం ద్వారా, ఈశ్వరుడి సంతానంగా ఆయన పట్ల మనకు గల భక్తి ద్వారా, క్రీస్తు మరియు ఇతర మహాఋషులందించిన ఉత్తేజకరమైన ప్రేరణను మనలోని శక్తి, ఆనందము, జ్ఞానము, మరియు ప్రేమలను సాక్షాత్కరింపచేసుకొనే దిశగా మరలింపగలుగుతాము. మనం అలా చేస్తుంటే వారి జీవితాల్లో పరిపూర్ణంగా వ్యక్తమైన కూటస్థ చైతన్యం మనలో అంతకంతకూ అధికంగా వ్యక్తమవుతుంది.

మన గురువు ఎంతగానో శ్లాఘించే, అసలైన క్రిస్మస్ ఉత్సవ వేడుక నిత్య జీవితంలో ఎదుర్కొనే ఎన్నో సవాళ్ళను ధైర్యంగా ఎదిరించి అంతరికంగా విజయం సాధించడానికి మనల్ని తగిన శక్తివంతులుగా చేస్తుంది. క్రియాయోగ కానుక యొక్క దివ్యనీడలో ఆశ్రయం పొందడం ద్వారా మనకు, మన ప్రియతములకు, ఇంకా మన ప్రపంచానికి దివ్యఆలంబన అనే చైతన్యంలో స్థిరంగా పాదుకొని ఉండగల సామర్థ్యం నానాటికీ విస్తృతమౌతుంది. అలాగే క్రమేపీ మన దివ్య పోషకుడి రక్షక వలయానికి ఎప్పుడూ బాహ్యంగా లేమనే సహజావబోధ జనిత నిర్భరత మనలో పెంపొందుతూ ఉంటుంది. మీ హృదయమూ, గృహమూ కూడా ఈ క్రిస్మస్ సమయంలోనూ, ఇంకా అన్నివేళలా కూడా ఆ భగవంతుడి నుండి, క్రీస్తు మరియు గురువుల నుండి నిరంతరాయంగా ప్రసరిస్తున్న నిర్నిబంధ ప్రేమ, శాశ్వత శాంతిల ఉద్ధారక స్పందనలతో నిండి ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను.

మీకు, మీ ప్రియతములకు పావన క్రిస్మస్ శుభాకాంక్షలతో,

స్వామి చిదానంద గిరి

ఇతరులతో పంచుకోండి