క్రీస్తు చైతన్యంపై పరమహంస యోగానందగారు

శ్రీ పరమహంస యోగానంద

పవిత్ర భూమిని ఆయన సందర్శించిన కొద్దికాలానికి, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ విద్యార్థులు మరియు స్నేహితులందరికీ 1935లో భారతదేశం నుండి వ్రాయబడినది.

జెరూసలేం మరియు భారతదేశంలోని మహాత్ముల అవగాహన ద్వారా పటిష్టపరచబడిన, పరమాత్ముని ఒక క్రొత్త సందేశాన్ని మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ విధంగా దైవానికి ఒక ఉపకరణంగా ఉండడంతో నా ఆత్మ ఆశీర్వదించబడినది.

ఆలోచన యొక్క కలము ఆకాశము యొక్క చీకటి పేజీపై వ్రాస్తుంది మరియు పరమాత్మ సత్యమును అదృశ్య దృశ్యంగా దర్శింపజేస్తుంది, మరియు నా ఫౌంటెన్ కలము కనిపించని ఆలోచనలను కనిపించేలా చేస్తుంది. కాబట్టి, అందరూ ఆయన మహిమను దర్శించేలా, ఈ పేజీలో—సిరాతో, ఆలోచనలతో, ఆత్మసాక్షాత్కారంతో—పరమాత్ముణ్ణి చిత్రిస్తున్నాను.

ఆలోచనలు, మాటల కిటికీ గు౦డా సత్య౦ తొంగిచూస్తున్నట్లే, క్రీస్తు జ్ఞానము మరియు స్పందనశీలక సృష్టి ద్వారా భగవంతుడు వ్యక్తమవుతాడు. క్రీస్తు చైతన్యం, క్రీస్తు శాంతి అనే విశ్వజనీనమైన అవగాహన తంతువుతో జాతులనే పూసలు కలిసిలేనప్పుడు, అవి విడిపోయి, స్వార్థపు రాళ్ళను తాకుతూ, చెల్లాచెదురుగా పడిపోతాయి. క్రీస్తు యొక్క క్రిస్మస్ ను అన్ని జాతులు పరస్పర ప్రేమతో అందరి హృదయాలలో జరుపుకోవాలి.

అంతర్జాతీయ అవగాహన అనే ఒక క్రొత్త ఊయలలో క్రీస్తు జన్మించాలని నేను ప్రార్థిస్తున్నాను; యుద్ధం యొక్క చీకటి రాత్రి నుండి, క్రీస్తు ప్రేమ యొక్క నక్షత్రం ఒక కొత్త ఐక్య ప్రపంచాన్ని ప్రకాసింపజేస్తుంది. అన్ని జాతులలో ఐక్యతా ప్రేమగా, మానవులందరిలో ఆధ్యాత్మిక ఆశయంగా, నిజమైన స్నేహితులలో దివ్య స్నేహితునిగా, ఈ మార్గంలోని విద్యార్థులలో ఆత్మసాక్షాత్కారంగా, గాఢమైన భక్తులందరిలో శాశ్వతమైన, నిత్య నూతన ఆనందంగా, నిత్య జ్ఞానంగా క్రీస్తు జన్మించాలని నేను ప్రార్థిస్తున్నాను.

ఐహిక సంపదలు, కీర్తి ప్రతిష్టలు అన్నీ వాడిపోతాయి, కానీ దైవ-నిబద్ధమైన ఆస్తులు శాశ్వతంగా, అత్యున్నతమైన ఉపయోగాన్ని కలిగి ఉంటాయి. మార్పు అనే వేదికపై భౌతిక సౌకర్యాన్ని ఎందుకు ఆరాధించాలి? అమరత్వ మందిరంలో ఆధ్యాత్మిక సౌకర్యాన్ని ఆరాధించడం నేర్చుకోండి. కూడబెట్టిన ఐహిక స౦పదలను, నాశన౦కాని దివ్యలోక స౦పదగా మార్చడానికి శ్రేష్ఠమైన మార్గ౦, వాటిని ఆధ్యాత్మిక సేవ కోస౦ వినియోగి౦చుకోవడమే. క్రీస్తులా జీవించటం తెలుసుకోవాలి. అపుడే అన్ని మంచి పనులలో, అన్ని ఐహిక మరియు ఆధ్యాత్మిక సేవలలో మరియు ధ్యానం యొక్క ఊయలలో, అమర విశ్వక్రీస్తు కొత్తగా జన్మిస్తాడు.

వేదాంత సంబంధమైన గ్రంథముల పఠనం ద్వారా క్రీస్తును ఎవరూ తెలుసుకోలేరు; గాఢమైన ధ్యానం యొక్క పొదరిల్లులో క్రీస్తు సాన్నిధ్యాన్ని అనుభూతి చెందాలి. భక్తి యొక్క లేత కొమ్మలతో అల్లిన, ధ్యాన-లయమైన ఆలోచనల ఊయలలో అంతర్గత శాంతి యొక్క పావుర మృదు మర్మర ధ్వని వల్ల ఉపశమించే నవజాత క్రీస్తును దర్శించండి.

ఈ ఇరవై శతాబ్దాల్లో క్రిస్మస్ ను 1,935 సార్లు జరుపుకున్నారు—అయినా ఏసు జననానికి స౦బ౦ధి౦చిన నిజమైన ప్రాముఖ్యతను కొద్దిమంది మాత్రమే గ్రహి౦చారు! ప్రతి స౦వత్సర౦, భగవంతుడు, దేవతలు ఈ సందర్భాన్ని అందరి మేలు కోసం దివ్య వేడుకలతో గుర్తిస్తారు. కాబట్టి మీలో ప్రతి ఒక్కరూ, కొద్దీ వారాల ముందు గాఢమైన ధ్యానం ద్వారా, రాబోయే ఈ క్రిస్మస్ ను జరుపుకోవడానికి మీ చైతన్యాన్ని సిద్ధం చేసుకోండి. మీ ధ్యానం అనే కుగ్రామంలోకి నవజాత క్రీస్తు చైతన్యం రాక వర్ణనాతీతంగా మనోహరంగా, ఉత్తేజకరంగా, మీ ఆత్మకు విస్తరిస్తుంది. మీ ధ్యాన చైతన్యం యొక్క మేరుదండ క్రిస్మస్ చెట్టును* దివ్యక్రీస్తు యొక్క అనేక కొత్త అవగాహనలతో, నిత్యం మెరిసే జ్ఞాన నక్షత్రాలతో మరియు దివ్య ప్రేమ యొక్క కమలాలతో అలంకరించడం ద్వారా క్రీస్తు కోసం సిద్ధం చేయండి. మీలోని ఈ అంతర్గత క్రిస్మస్ చెట్టు పాదాల దగ్గర మీ కోరికలన్నింటినీ నివేదించండి, మీలోని క్రీస్తు ఆనందానికి ఇప్పటికీ, ఎప్పటికీ అవి సమర్పించబడతాయి.

అప్పుడు, క్రిస్మస్ ఉదయం మేల్కొన్నప్పుడు, మీ చైతన్యం యొక్క శాశ్వత స్వర్ణ తంతులతో శాఖోపశాఖలైన క్రిస్మస్ చెట్టు దగ్గరికి వచ్చి, క్రీస్తు మీ బహుమతులను స్వీకరించి తన అనశ్వర కానుకలైన సర్వవ్యాపకత్వం, సర్వజ్ఞత్వం, దివ్యప్రేమ, విశ్వకాంతి, నిత్య జాగృతి, నిత్యనవీన ఆనందాన్ని అందిస్తాడు.


*ఆధ్యాత్మిక మేధస్సు మరియు శక్తి యొక్క మానవుడి ఏడు మేరుదండ మస్తిష్క కేంద్రాలకు సూచన, గాఢంగా ధ్యానించే భక్తుల అంతర్ దృష్టికి వెలుగులుగా వ్యక్తమవుతుంది. హిందూ గ్రంథాలలో, ఈ కేంద్రాలు తరచుగా “కమలాలు”గా వర్ణించబడ్డాయి; బుక్ ఆఫ్ రివిలేషన్‌లో, సెయి౦ట్ జాన్ వాటి ప్రకాశవ౦తమైన కిరణాలను “ఏడు నక్షత్రాలు”గా పేర్కొన్నాడు.

ఇతరులతో షేర్ చేయండి