జన్మాష్టమి 2015 సందర్భంగా శ్రీ శ్రీ మృణాళినీమాత సందేశం

ప్రియతమా,

భగవాన్ శ్రీ కృష్ణుని జన్మదినమైన జన్మాష్టమి యొక్క ప్రపంచవ్యాప్త వేడుకలలో మేము పాల్గొంటున్నప్పుడు, ఆ దివ్య ప్రేమావతారమూర్తి యొక్క అత్మోత్తేజితమైన గీతమును మీరు మీ హృదయంలో వినవచ్చు. మంత్రముగ్ధులను చేసే కృష్ణ వేణువు శ్రావ్యత అత్మోద్ధారక పరిణామంలో ముందుకు నడిపించే భగవంతుని ఆంతరంగిక ఆహ్వానానికి సంకేతం, అది మనం కోల్పోయిన శాశ్వతత్వపు ఆనంద సామ్రాజ్యం కోసం గాఢమైన వాంఛను మేల్కొల్పుతుంది. అదే సమయంలో కృష్ణుడి జీవితం మరియు అర్జునుడికి అతని జ్ఞానోపదేశము, ఆ రాజ్యాన్ని తిరిగి పొందాలంటే మనల్ని ఆ లక్ష్యం నుండి మళ్లించే ప్రయత్నం చేసే ఏ అంతః మరియు బాహ్య పరిస్థితులకు భయపడని నిజమైన ఆధ్యాత్మిక యోధుని యొక్క పరాక్రమాన్ని, క్రమశిక్షణను మరియు అభేద్యమైన సంకల్పాన్ని పెంపొందించుకోవాలని మనకు గుర్తుచేస్తాయి.

నేటి ప్రపంచంలోని రోజువారీ ఒత్తిళ్లు మరియు బాధ్యతలు మరియు వేగగతిలో మార్పులు, ప్రతిదీ మన దృష్టిని బయటికి లాగడానికి కుట్ర చేస్తున్నట్లు అనిపించవచ్చు. మానవ స్వభావ వైఖరి తరచుగా మన దృష్టికి వచ్చిన అవసరాలకు నిరుత్సాహపడటం లేదా వాటిపై తిరుగుబాటు చేయడం, మరియు జీవితం సరళంగా ఉంటేనే మనం మరింత త్వరగా అభివృద్ధి చెందగలమని భావించడం. కానీ గురుదేవులు పరమహంస యోగానందగారు మనకు చెప్పినట్లుగా, “భగవద్గీతలోని శ్రీ కృష్ణుని సందేశం ఆధునిక యుగానికి మరియు ఏ యుగానికైనా సరైన సమాధానం: కర్మ యోగం, బంధరహితంగా మరియు దైవసాక్షాత్కారం కోసం ధ్యానం చేయడం.” దేవుడు మరియు మన కర్మ మనలను ఉంచిన ఈ యుద్ధభూమిలో, మాయపై విజయాన్ని తెచ్చే సమతుల్య జీవన కళను మనం నేర్చుకోవాల్సి ఉన్నాము. దైవం మనకు ఆదర్శవంతమైన బాహ్య పరిస్థితులను హామీ ఇవ్వదు. బదులుగా ఆయన అంతకన్నా ఉన్నతమైనదాన్ని ఇస్తాడు – మనం బలాన్ని మరియు ఆత్మ విమోచనాన్ని పొందేందుకు అవసరమైన అవకాశాలను ఇస్తాడు. జీవితంలో వివిధ పరిస్థితులు ధ్యానం చేసే మీ సామర్థ్యాన్ని తగ్గించినప్పుడు లేదా మీ మార్గంలో అడ్డంకులు ఉన్నట్లు అనిపించినప్పుడు, అదే పరిస్థితులను ఉపయోగించి మీలో దేవుని పట్ల ఎక్కువ కోరికను రేకెత్తించండి. అంతరంగికంగా ఆయనతో ఉండటానికి గల మార్గాలను కనుగొనాలనే మీ దృఢ నిశ్చయాన్ని పెంచుకోండి – కార్యకలాపాల సమయంలో కూడా ఆయన ఉనికిని అభ్యసించండి మరియు, కొద్ది సమయం చేసే అంతః సహవాసంలో కూడా మిమ్మల్ని మీరు పూర్తిగా ఆయనకు అప్పగించగలిగేటట్లు మీ మనస్సుకు శిక్షణ ఇవ్వండి. అప్పుడు బయటి పరిస్థితులు మనల్ని బంధించలేవు. అహంకార ప్రతిఘటన మరియు వాటిలో మన భావోద్వేగ ప్రమేయం వలన మనం మాయ ప్రపంచంలో చిక్కుకుంటాము. మన ఇష్టాలు, అయిష్టాలు మరియు మన కర్మ ఫలానుబంధం నుండి ఉత్పన్నమయ్యే చింతలే తరచూ గొప్ప పరధ్యాన కారకాలు. మనం ఆ అనుబంధాలను వదిలేయటం ప్రారంభించి, ప్రేమతో మన నిరాడంబర సమర్పణగా మన ఉత్తమ ప్రయత్నాలను భగవంతుని పాదాల వద్ద ఉంచినప్పుడు, మనం స్వేచ్ఛ మరియు మనశ్శాంతిని మరియు ఎలాంటి పరిస్థితులలో అయినా చెదరని అంతః సంతులనమును పొందుతాము.

ప్రతి పరిస్థితిని భగవత్ సాన్నిధ్యాన్ని పెంచుకోవటానికి ఒక సాధనంగా చూడటం ద్వారా, మనం మన జీవితమనే వస్త్రంలో దేవుని నిరంతర చింతనను అల్లుతాము, చివరికి మనం క్షణమాత్రం కూడా ఆయన నుండి వేరుగా ఉండమని గ్రహిస్తాము. భగవంతుడు అర్జునుడికి తెలియజేసినట్లు: “ఎవడు నన్ను అంతటా దర్శిస్తాడో మరియు అన్నిటినీ నాలో దర్శిస్తాడో అతడి దృష్టికి నేను ఎప్పుడూ దూరం కాను, అతడు నా దృష్టి నుంచి ఎప్పుడూ దూరం కాడు.”

జీవిత అనుభవాలన్నింటిలో ఆ దివ్య హామీ మిమ్మల్ని నిలబెట్టి, బలపరుస్తుందని మీరు భావించవచ్చు.

దేవుడు మరియు గురుదేవుల దివ్య ప్రేమ మరియు నిరంతర ఆశీర్వాదాలలో,

శ్రీ శ్రీ మృణాళినీమాత

కాపీరైట్ © 2015 సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్. అన్ని హక్కులూ ఆరక్షితమైనవి.

ఇతరులతో పంచుకోండి