సర్వవ్యాపి అయిన క్రీస్తుకు ఊయల

శ్రీ శ్రీ పరమహంస యోగానంద

ఈ రాబోయే క్రిస్మస్ సమయంలో, మహోన్నతమైన భక్తికి సంబంధించిన కొత్త ద్వారాన్ని తెరవండి, తద్వారా క్రీస్తు యొక్క సర్వవ్యాప్తి మీ చైతన్యంలోకి కొత్తగా రావడానికి వీలు కలుగుతుంది. ప్రతి రోజు, ప్రతి గంట, విలువైన ప్రతీ క్షణం, క్రీస్తు మీ అజ్ఞానపు చీకటి ద్వారాలను తడుతూనే ఉన్నాడు. మీ అంతరంగిక పిలుపుకు సమాధానమిచ్చేందుకు, తన సర్వవ్యాపక క్రీస్తు చైతన్యాన్ని మీలో మేల్కొల్పడానికి ఈ పవిత్రమైన వేకువజామున, క్రీస్తు ప్రత్యేకంగా వస్తున్నాడు.

మీ ధ్యానం యొక్క దారాలతో సున్నితమైన అవగాహనల ఊయలని నేయండి మరియు అనంతత్వపు శిశువును స్వాగతించి తగినంత విస్తారతలో పట్టుకోగలిగేంత అనుకూలంగా దానిని చేయండి. క్రీస్తు పచ్చికబయలులో జన్మించాడు; ఆయన సౌమ్యత అన్ని పరిమళాల్లోనూ నిండి ఉంది. సముద్రం అలంకరించుకున్న భూగోళం, నీలిరంగు నక్షత్రాల పచ్చికబయలు, ప్రాణత్యాగం చేసే అమరవీరులు మరియు సాధువుల యొక్క ఎర్రబారిన ప్రేమ, సర్వవ్యాప్త శిశువైన క్రీస్తు కోసం నివాస స్థలాన్ని అందించడంలో ఒకరితో ఒకరు పోటీ పడ్డారు.

క్రీస్తు నిత్యత్వపు ఎదలో అంతటా నిద్రిస్తున్నాడు; ఆయన ఎప్పుడైనా ఎక్కడైనా, ముఖ్యంగా మీ నిజమైన ఆప్యాయత యొక్క వెచ్చదనపు పునర్జన్మ తీసుకోవడానికి ఇష్టపడతాడు. అనంతుడైన క్రీస్తు నిత్యనూతన జ్ఞానం మరియు సృజనాత్మక వ్యక్తీకరణ యొక్క వైభవము ప్రతిచోట ఉన్నప్పటికీ, ఆయన మీ ఎడతెగని భక్తి అనే ఊయలలో కనిపించాలని మీరు ఎంచుకుంటే తప్ప మీరు ఆయనను ఎప్పటికీ చూడలేరు.

మీ హృదయం అనే సౌకర్యవంతమైన చిన్నగది కేవలం స్వీయ ప్రేమను మాత్రమే కలిగి చాలా కాలంగా సంకుచితంగా ఉంది; ఇప్పుడు మీరు దానిని అపరిమితం చేయాలి, తద్వారా సామాజిక, జాతీయ, అంతర్జాతీయ, ప్రాణుల మరియు విశ్వవ్యాప్తమైన క్రీస్తు-ప్రేమ అక్కడ జన్మించి ఏకమాత్ర ప్రేమగా మార్పు చెందుతుంది.

క్రిస్మస్ పండుగ సముచితమైన ఉత్సవాలు మరియు భౌతిక బహుమతుల మార్పిడి ద్వారా మాత్రమే కాకుండా, గాఢమైన నిరంతర ధ్యానం ద్వారా కూడా జరుపుకోవాలి, మీ స్పృహను క్రీస్తు కోసం విశ్వ దేవాలయంగా మార్చాలి. అలాగే మీ ద్వేషపూరిత మరియు స్నేహపూర్వక సోదరులను కూడా శారీరకంగా, మానసికంగా మరియు ఆధ్యాత్మికంగా ఉద్ధరించడానికి మీ అత్యంత విలువైన ప్రేమ, సద్భావన మరియు సేవను అందించాలి.

అనంతమైన క్రీస్తు ప్రతిచోటా ఉన్నాడు; హిందువులు, బౌద్ధులు, క్రైస్తవులు, ముస్లింలు, యూదులు మరియు ఇతర నిజమైన మత దేవాలయాలన్నిటిలో ఆయన జననాన్ని ఆరాధించండి. సత్యం యొక్క ప్రతి వ్యక్తీకరణ సర్వవ్యాప్త క్రీస్తు జ్ఞానం నుండే ప్రవహిస్తుంది, కాబట్టి ఆ పవిత్రమైన విశ్వవ్యాప్త జ్ఞానాన్ని ప్రతి స్వచ్ఛమైన మతం, విశ్వాసం మరియు బోధనలో ఆరాధించడం నేర్చుకోండి. విశ్వమయుడైన క్రీస్తు, మానవుడు అనే దివ్యమైన జీవిని ఉనికిలోకి తీసుకురావాలని కలలు కన్నాడు. అందుచేత మీరు, ప్రతి జాతి మరియు జాతీయత పట్ల కొత్తగా మేల్కొన్న సమ-ప్రేమలో క్రీస్తు జననాన్ని జరుపుకోవాలి.

నవవికసిత పుష్పాలు మరియు నక్షత్ర మెరుపులు అనంతమైన క్రీస్తు యొక్క రూపాలు; ప్రతీ ఒక్కదానికి మీ ప్రేమమాలను వేయండి. మీ ప్రేమలో తల్లిదండ్రులు, స్నేహితులు, బంధువులు, పొరుగువారు మరియు అన్ని జాతుల పట్ల పారవశ్యమైన క్రీస్తు ప్రేమ జనించడం చూడండి. మీ ఆత్మ యొక్క పవిత్ర మందిరంలో, మీ చంచలమైన ఆలోచనలను సమీకరించి మరియు వాటిని స్థిరపరచి, క్రీస్తు పట్ల లోతైన ఐక్య ప్రేమను సేవించడంలో పాల్గొనమని ఆహ్వానించండి.

బహుమతులను కుటుంబ క్రిస్మస్-చెట్టు చుట్టూ ఉంచినప్పుడు, మీ ప్రతి ఆలోచనను క్రీస్తు యొక్క దివ్యపీఠంగా మార్చుకొని, మీ సద్భావనలతో బహుమతులను నింపండి. నక్షత్రంలో, ఆకులో, మొగ్గలో, కోకిల వంటి పక్షులలో, పూలగుత్తిలో మరియు మీ మృదువైన భక్తిలో, సమస్త సృష్టిలో క్రీస్తు జననాన్ని ఆరాధించండి. మీ హృదయాన్ని అన్ని హృదయాలతో ఏకం చేయండి, తద్వారా క్రీస్తు మీ హృదయములో జన్మించి ఎప్పటికీ ఎప్పటికీ అక్కడే ఉండిపోతాడు.

(శ్రీ శ్రీ పరమహంస యోగానంద రచించిన The Second Coming of Christ: The Resurrection of the Christ Within You సారాంశం లోనిది)

ఇతరులతో పంచుకోండి