ప్రపంచమంతటా క్రియాయోగ బీజాలు నాటడం

క్రియాయోగ సాధకులలో అధిచేతనా స్థితి లక్షణాలు గోచరించడం

In 1920, ఈ ఆధునిక కాలానికి క్రియాయోగాన్ని పునరుజ్జీవింపజేసిన గొప్ప గురువులు శ్రీ మహావతార బాబాజీ గారు పరమహంస యోగానందగారిని 4 గర్పార్ రోడ్డులోని ఆయన ఇంటిలో 1920 లో కలిశారు. ఈ యువ సన్యాసికి బాబాజీ ఇలా చెప్పారు: “పశ్చిమ దేశాల్లో క్రియాయోగ వ్యాప్తికోసం నేను ఎన్నిక చేసిన వాడివి నువ్వే. చాలా కాలం క్రితం నేను నీ గురువు శ్రీయుక్తేశ్వర్ ను ఒక కుంభ మేళాలో కలిశాను; నిన్ను తన దగ్గరకు శిక్షణ కోసం పంపుతానని అప్పుడు నేను ఆయనకు చెప్పాను.”

స్వామి శ్రీయుక్తేశ్వర్ గారి దగ్గర తాను పొందిన శిక్షణ వల్ల తాను క్రియాయోగంతో ఉత్కృష్టమైన విశ్వ చేతనా స్థితులను ఎలా అందుకోగలిగానో వివరిస్తూ, పరమహంసగారు ఇలా వ్రాశారు: “నేను కావాలనుకొన్నపుడు ఆ స్థితిని నాకు నేను ఎలా పొందవచ్చో, అలాగే తమ సహజవబోధనా మార్గాలు అభివృద్ధి చెందిన ఇతరులలో ఆ అనుభవం ఎలా కలిగించవచ్చో శ్రీయుక్తేశ్వర్ గారు నాకు నేర్పించారు.”

శిష్యుడికి—అతడు సాధించిన ఆధ్యాత్మిక అభివృద్ధి, గ్రహణ శక్తి పై ఆధారపడి అతడిలో ముందుగానే కొద్దో గొప్పో అనుభూతమయ్యే — దివ్యచేతన, ఆశీర్వాదాలు ప్రసారం చేయడం క్రియాయోగ వ్యాప్తిలో ప్రధాన భాగం. క్రియ ఒక తత్వబోధ లాగా కాక, బాబాజీ ఆదేశించినట్టుగా — దైవం నిర్దేశించిన ఒక నిజమైన గురువుకూ, శిష్యుడికీ మధ్య నెలకొనే పవిత్ర బాంధవ్యాన్ని దృష్టిలో ఉంచుకొని — ఒక ఆధ్యాత్మిక దీక్ష గా ఇవ్వబడుతుంది.

ఒక యోగి ఆత్మ కథ చివరిలో పరమహంస గారు ఇలా వ్రాశారు: ఆ దివ్య పిత సంతానంగా తమ పూర్వ స్థితిని తిరిగి పునఃస్థాపించుకొనడానికి తగిన ప్రయత్నం చేసి, తద్వారా తమ కోసం ఎదురుచూస్తున్న శాంతి సమృద్ధులు నిండిన ప్రపంచం మనకు దర్శనమివ్వాలంటే వందల వేల క్రియ యోగులు అవసరమవుతారు, కేవలం డజన్ల మంది కాదు. ఆత్మ సాక్షారానికి, మానవుల దుఃఖాన్ని పారద్రోలాడానికి నిర్దిష్టమైన, శాస్త్రీయ ప్రక్రియ ఒకటి ఉంది అని ప్రజలందరూ తెలుసుకొందురుగాక!

డాక్టర్ ఎం. డబ్ల్యూ. లూయిస్

బోస్టన్ లో డెంటిస్ట్ అయిన డా. మినోట్ డబ్ల్యూ.లూయిస్ పరమహంస యోగానందగారు 1920 లో అమెరికా చేరిన కొద్ది కాలానికే కలుసుకొని ఆయన నుండి పవిత్రమైన క్రియాయోగ దీక్ష తీసుకొన్న మొదటి అమెరికా శిష్యుడు అయ్యారు. ఆయన తాను ఉపాధ్యక్షుడు గానూ, సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ కు ప్రియ బోధకుడు గానూ ఉన్న అనేక సంవత్సరాలలో పరమహంసగారిని తాను మొదట కలుసుకొన్నకథను చాలాసార్లు చెప్పేవారు. ఆయనచేసిన అనేక ప్రసంగాల నుండి సేకరించిన విశేషాలు సమకూరిస్తే క్రింది కథనం తయారయింది.

1920 చివరిభాగంలో, పరమహంస యోగానందగారు అమెరికా చేరిన కొద్దికాలానికే బోస్టన్ ప్రాంతంలో ఒక యూనిటేరియన్ చర్చ్ లో ప్రసంగించమని ఆ యువ స్వామికి ఆహ్వానం అందింది. అక్కడ సమావేశ మయిన వారిలో శ్రీమతి అలిస్ హేసీ అనే ఆవిడ డా. లూయిస్ కు చిరకాల మిత్రులు. (ఆమెకు తరువాతి కాలంలో పరమహంస గారు సిస్టర్ యోగమాత అని పేరు పెట్టారు)శ్రీమతి హేసీకి ఆధ్యాత్మికత పట్ల డా లూయిస్ కి ఉన్న ఆసక్తి తెలుసు. అందువల్ల ఆమె లూయిస్ తో స్వామి యోగానందను ఎలాగైనా కలవమని చెప్పారు.

 

“అప్పుడు గురువుగారు తన నుదుటిని నా నుదురుకు ఎదురుగా పెట్టారు. నా కళ్ళు పైకెత్తి కనుబొమల మధ్య స్థానంలో చూడమన్నారు. నేనలాగే చేశాను. అప్పుడు నేనక్కడ ఆధ్యాత్మిక నేత్రం యొక్క గొప్ప కాంతిని దర్శించాను.”

క్రిస్మస్ ముందురోజు యూనిటీ హౌస్ లో — గురుజీ కి ఉన్న గదిలో — ఆయన్ను కలవడానికి అనుమతి తీసుకోవడం జరిగింది. అది నిలబెట్టుకోవడానికి డాక్టర్ లూయిస్ ఇల్లు వదిలి బయలు దేరినపుడు కొద్దిసేపతిలో ఇంటికి వెళ్లిపోతానని ఆయన అనుకున్నారు. తన భార్య అయిన మిల్ద్రెడ్ తో తాను త్వరగానే వచ్చిక్రిస్మస్ చెట్టు అలంకరిస్తానని చెప్పారు.

యూనిటీ హౌస్ కి వెళ్ళే దారిలో ఆయన మత బోధకుల వేషంలో వచ్చే మోసకారుల వలలో పడవద్దని తన తల్లిదండ్రుల హెచ్చరిక గుర్తు తెచ్చుకున్నారు; అతడి మానసిక స్థితి సందేహంతో నిండి ఉంది.

పరమహంసగారు డాక్టర్ ను ఆదరంగా ఆహ్వానించారు. ఈ యువ పళ్ల డాక్టర్ కు మనసులో ఎన్నో అధ్యాత్మిక సందేహాలున్నాయి. పరమహంసగారు వాటన్నిటికీ తృప్తికరమైన సమాధానాలిచ్చారు. చాలా ఏళ్ల తరువాత ఆ సందర్భం గురించి డాక్టర్ మాట్లాడుతూ, “నేను ‘మిస్సోరీ నుండి’ వచ్చాను. అందువల్ల ఏవిషయమైనా [నేను నమ్మాలంటే] నాకు చూపించాల్సి ఉంది. అంతకు మించి నేను న్యూ ఇంగ్లాండ్ వాడిని. ఏ విషయమైనా నేను తెలుసుకోవాలి!”

1920వ సంవత్సరపు ఆ క్రిస్మస్ ముందు రోజుసాయంత్రం ఆయన పరమహంసగారితో ఇలా అన్నారు “ ‘శరీరానికి వెలుగు కన్ను. కాబట్టి నీ కన్ను ఒక్కటే అయితే నీ శరీరమంతా వెలుగుతో నిండిపోతుంది. అని బైబిల్ మనకు చెబుతుంది” దీనిని వివరించగలరా?’

“వివరించగలననుకుంటాను” అన్నారు గురువుగారు.

డాక్టర్ ఇంకా సందేహాస్పదంగానే ఉన్నారు. నేను చాలా మందిని అడిగాను. ఎవరికీ దాని అర్ధం తెలిసినట్టు లేదు.

గుడ్డివాడు గ్రుడ్డివాడిని నడిపించ గలడా? ఇద్దరూ కలిసి తప్పు అనే ఒకే గుంటలో పడిపోతారు.

“ఈ విషయాలు మీరు నాకు చూపించగలరా?”

“అనుకుంటాను” గురువుగారు అదే మాట మళ్ళీ అన్నారు.

“అయితే, దయచేసి నాకు చూపించండి!”

గురువుగారు డాక్టర్ ను నేలమీద మఠం వేసుకొని కూర్చోమన్నారు. తాను ఆయనకు ఎదురుగా కూర్చున్నారు. డాక్టర్ గారి కళ్లలోకి సూటిగా చూస్తూ పరమహంస గారు అన్నారు: “నేను నిన్ను ప్రేమించినట్టుగా ఎప్పటికీ నన్ను ప్రేమిస్తావా?”

డాక్టర్ ఔనని సమాధానం చెప్పారు. అప్పుడు గురువుగారు అన్నారు, “నీ పాపాలు క్షమించ బడ్డాయి, నీ జీవితాన్ని రక్షించే భారం నేను తీసుకుంటున్నాను.”

“ఈ మాటలతో నా భుజాల మీదనుంచి ఎంతో బరువు తీసేసినట్టనిపించింది” అని డాక్టర్ తరువాత గుర్తు చేసుకున్నారు. ఇది సత్యం. నేను చాలా తేలిక పడ్డాను — కొండలంత కర్మ నుండి, మాయ నుండి విముక్తి పొందాను. ఆ బరువు అప్పటినుండీ తొలగిపోయింది. జీవితంలో చాలా సవాళ్ళు — ఎన్నో ఉన్నాయి — కానీ ఆ భారం మళ్ళీ తిరిగి రాలేదు.

కథ కొనసాగింపు, డా లూయిస్ చెప్పారు:

గురువుగారు తన నుదురును నా నుదురుకు ఎదురుగా పెట్టారు. నా కళ్ళుపైకెత్తి కనుబొమల మధ్య కేంద్ర బిందువును చూడమన్నారు, నేనలాగే చేశాను. అక్కడ నేను ఆధ్యాత్మిక నేత్రం యొక్క గొప్ప కాంతిని దర్శించాను. నాకు ఏమి కనిపిస్తుందో గురువు గారు ముందు గా నాకు సూచన ఇవ్వలేదు. అలా సూచన ఇవ్వడం ద్వారా ఆయన నన్ను ఏవిధంగానూ ప్రభావితం చేయలేదు. నేను దర్శించినది నాకు సహజంగానే సంభవించింది.

“నేను సంపూర్ణ చైతన్యంతో, సంపూర్ణ జాగృతిలో, సంపూర్ణ అప్రమత్తతతో ఉన్నాను. గురువుగారు నా మానసిక తరంగాలను నిలకడగా అయేటట్టు చేసి నా ఆత్మ యొక్క సహజావబోధం వల్ల నాకీ దర్శనం అయేలా తోడ్పడ్డారు. నేను ఆ గొప్ప బంగారు కాంతి లోకి ఇంకా చూసేకొద్దీ మొత్తం ఆధ్యాత్మిక నేత్రం రూపొందింది. దానిలోపలి ముదురు నీలి రంగు భాగం నాలోని కూటస్థ చైతన్యానికి ప్రాతినిధ్యం వహిస్తుండగా, చివరిగా తెల్లని చిన్ని వెండి నక్షత్రం విశ్వ చైతన్యానికి సంగ్రహ రూపంగా నిలిచింది.

“మనలో ప్రతి ఒక్కరిలోను ఉన్న ఆ అంతరిక వాస్తవాన్ని నాకు దర్శింపజేయ గలిగిన ఒక్కరిని కనుగొనగలిగినందుకు నేను పరమానందభరితుడినయాను. ఆయన సాధారణ వ్యక్తి కాదనీ, ఆధ్యాత్మిక విషయాలు తమకు తెలుసునని ప్రకటించుకొనే మామూలు మనుషులకు, ఈయన పూర్తిగా వేరు అని గ్రహించాను. “మేము కొద్ది నిముషాలు మాట్లాడుకొన్నాము, ఆ తరువాత ఆయన మరొకసారి తన నుదురును, నా నుదురుకు అదిమిపెట్టారు; అప్పుడు నాకు దర్శన మయింది, వేయి రేకుల పద్మం యొక్క ప్రకాశం [మెదడు పైభాగంలో ఉండే అత్యున్నత అధ్యాత్మిక కేంద్రం]—తన అనేకానేక వెండి రేకుల కిరణాలతో కనిపించే అత్యద్భుత దర్శనం. అలా నేను చూస్తుండగా రక్త నాళాల్లో చిన్ని చిన్ని వెలుగు మెరుపులు ఊగుతూ ముందుకుపోయేటపుడు రక్తనాళాల గోడలకు తగులుతూ, నా కళ్లముందు సాగిపోతున్నాయి. ఇవి రక్త కణాలు, ఈశ్వరుడి ఈ కాంతి నాటకంలో తన పాత్రను పోషిస్తూ వాటిలో ప్రతి ఒకటీ తనలోని సూక్ష్మ కాంతిని వ్యక్తపరుస్తోంది చేస్తోంది.

“పరమహంసగారు ఈశ్వరుడి ఆ గొప్ప కాంతిని నాకు చూపించి, ఇలా అన్నారు: నీవు ఈ మార్గానికి బద్ధుడవై, క్రమం తప్పకుండా ధ్యానం చేసినట్టయితే ఈ దర్శనం ఎప్పటికీ నీదే అవుతుంది ‘ అందువల్ల నేను ఆయన సలహా పాటించాను. నేనెప్పుడూ నా క్రియాయోగ సాధన మానలేదు. క్రమేపీ భగవంతుడి ప్రకాశం నాలో ప్రవేశించింది. నాకేది లభించిందో అది గురువుగారినుండి లభించింది. ఆయన నన్ను భ్రాంతి యొక్క అనిశ్చితి నుండి, వాస్తవికత అనే వెలుగులోకి లేవనెత్తారు. ఆ అనుభవం వచ్చినపుడు అది హృదయాన్ని మారుస్తుంది. అప్పుడు మనం మానవులందరి సహోదరత్వాన్ని, ఈశ్వరుడి పితృత్వాన్ని వాస్తవంగా అనుభూతి చెందుతాము.”

తారామాత

తారామాత 1924 నుండి ఆమె 1971లో పరమపదించే వరకు పరమహంస యోగానందగారి ఒకయోగి ఆత్మకథ, ఇంకా ఇతర రచనలకు సంపాదకురాలిగా సేవ చేసిన ఉన్నత స్థితికి చేరిన క్రియాయోగి. 1924 లో ఆమె పరమహంసగారిని కలిసిన కొద్ది రోజులకే ఆమె ఈ క్రింది వ్యాసం విశ్వచేతనానుభవ భాగ్యం పొందిన “వ్యక్తి” గురించి వ్రాశారు. ఆమె వినయంతో తన గుర్తింపును దాచిపెట్టినా ఆమె ఇక్కడ ప్రస్తావించిన అనుభవాలు అమెవే. (ఆమె వ్రాసిన పూర్తి వివరణ ‘ఫోర్ రన్నర్ ఆఫ్ ఎ న్యూ రేస్’ అన్న పుస్తకం గా ప్రచురితమయింది. అది సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ లో లభిస్తుంది.)

దైవ జ్ఞానం అనేది ఏదో కొద్దిమంది ఎన్నికైన వారికి మాత్రమే లభిస్తుందని, సగటు మనిషి తనలోని “విశ్వాసం” ఎంత బలంగా ఉందో అంత మాత్రమే గురువు సమీపంలోకి చేరగలుగుతాదని చాలామంది అనుకుంటారు. కాని భగవంతుడిని చేరుకోవడానికి నిశ్చితమైన ప్రక్రియ ఒకటి ఉన్నదనీ [క్రియాయోగం], అందరూ ఎలాటి పరిస్థితులలోనైనా దానిని ఉపయోగించ వచ్చు అన్న సమాచారం ఎందరో సెల్ఫ్-రియలైజేషన్ విద్యార్థులకు ఒక విముక్తి కారకమైన దిగ్భ్రాంతికర సమాచారం. వారు ఒక కొత్త జన్మ ఎత్తామని అనుకుంటారు.

ప్రపంచ ధార్మిక గ్రంథాలలో ముఖ్యంగా హిందూ గ్రంథాలలో ఎంతో పరిజ్ఞానం ఉన్న ఒక వ్యక్తి — ఇతడికి తీవ్రమైన ఆధ్యాత్మిక విశ్వాసం, ఆకాంక్ష ఉన్నాయి — ఈ పరిజ్ఞానం రాళ్లతోనిండిన వట్టి బంజరుభూమి లాంటిదని, దానివల్ల తనలోని ఆత్మాకలి తీరదని అతడికి తెలుసు. తను కేవలం ఆధ్యాత్మిక ఆహారాన్ని గురించి చదవడమే కాదు, దానిని రుచిచూడాలన్నది అతడి‌ ఆకాంక్ష. సమంగా సాగిపోతున్న అతడి రోజుల క్రింద నిరాశ అనే నల్లని అగాధం ఉంది — అతడికి అప్పటివరకూ అలాంటి అనుభవం కలుగనందున నేనెప్పటికైనా ఈశ్వరుడితో ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచుకోగల అర్హత నాకు ఉన్నదా అని నిరాశచెందేవాడు. చివరికి అతడు ఈశ్వరుడిని కాక తననే సందేహించాడు. ఎప్పటికైనా మేధతోఈశ్వరుడిని గురించి తెలుసుకోవడానికి మించి ఏమైనా పొందగలనా అని! ఈ యోచన అతడి జీవన మూలాలను తాకి జీవితం అర్ధహీనంగా, పనికిమాలినదిగా అతడికి అనిపించింది.

వై.ఎస్.ఎస్. /ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగుల అనుభవాలు

ఈశ్వరుడి దయవల్ల ఇరవై ఏళ్ళ క్రితం నేను క్రియాయోగ దీక్ష తీసుకున్నాను. కుటుంబ సభ్యులను నిద్రలేపే లోపు ఉదయం 4 గంటల వేళ ధ్యానం కోసం లేవడం, ఆ సమయం రోజులో అత్యంత ప్రశాంత సమయంకావడం వల్ల నేను ఉదయం ధ్యానాన్ని చాలా గాఢంగా ఆస్వాదించాను. భగవంతుడికి మనకు మధ్య దూరం మన భక్తికి తగ్గ నిష్పత్తిలో ఉంటుందని నేను గ్రహించానని చెప్పదలచుకున్నాను. ఈశ్వరుడితో ఉండాలని ఎంతగా కోరుకుంటే ఆయన నాకు అంత తేటగా దర్శనమిచ్చాడు.
ఒక ఏడాది క్రిందట, నా శ్వాస స్తంభించింది, వెనుబాము క్రిందినుండి పైవరకు నిటారుగా అయింది, శరీరమంతా క్రమంగా గడ్డకట్టినట్టయింది. అయితే మనసు ప్రకాశవంతమయిన కాంతితో, అనంత ఆనందంలో మునిగిపోయింది.
శ్రీ యోగానందగారు ఎస్.ఆర్.ఎఫ్. వెబ్ సైట్ లో పేర్కొన్న ఈ పలుకులలోని సత్యాన్ని నేను దృఢంగా చెప్పగలను: “భగవంతుడి ఉనికికి మొదటి రుజువు అనిర్వచనీయమైన శాంతిని అనుభూతి చెందడం. అది మానవ ఊహకు అందనంత ఆనందంగా పరిణామం చెందుతుంది.” నా గురువు యోగానందగారికి, మనలను నడిపిస్తున్న ఆధ్యాత్మిక శక్తులకు నా స్తుతులు. ఈశ్వరుడి మహిమకు జయం.

— ఎన్.కే. నమీబియా

నేను ఉదయమూ, సాయంత్రమూ ధ్యానం చేసుకుంటూ ఉండగా, మొదటి ఆరునెలలు గడిచాక ఒకరోజు సాయంత్రం నాకు బాగా అలసటగా ఉన్నందున ధ్యానం చేయకుండానే పడుకుంటానని నా భార్యకు చెప్పాను. ఏమీ సందేహించకుండా నా భార్య నా చొక్కా కాలరు తన రెండు చేతులతో పట్టుకొని, నా ముఖానికి కొద్ది అంగుళాల దూరంలో మాత్రమే తన ముఖం పెట్టి నేను ధ్యానం చేసి మాత్రమే నిద్రపోవాలని ప్రకటించింది. నేను చాలా ఆశ్చర్యపోయి నేను ఎస్.ఆర్.ఎఫ్. లో ఉండడం తనకు ఇష్టం లేదేమో, ఏదో కొత్త మతంలో చేరాననుకుంటుందేమో అనుకున్నాను, అన్నాను. అప్పుడామె ఇలా వివరించింది.” ఈ ఆరు నెలల్లో నువ్వు నేనెప్పుడూ కోరుకున్న భర్తలాగా మారావు, నిన్ను మళ్ళీ నీ పాత పద్ధతిలోకి మారనివ్వను నేను, వెళ్ళు ధ్యానం చేసుకో!”
అది 33 ఏళ్ల క్రిందటి మాట, అంటే ఊహించుకోండి. నా ధ్యానాలు, (నా వైవాహిక జీవితం) అంతకంతకూ మధురంగా మారాయి. జీవితపు అనేక రంగాలలో గురువుగారి బోధనలు తెలుసుకుని, వాటిని జీవితంలోనూ, ఆలోచనలోనూ వాస్తవంగా అమలు పరచేంతగా చాలా కాలంగానే నేనీ మార్గంలో ఉన్నాను. “వెయ్యెళ్లయినా, రేపటివరకైనా” అన్న మాటలు ఒక ఆనందకరమైన వాగ్దానాన్ని సూచిస్తాయి. తద్వారా నా ఆత్మా అందరిలోనూ ఉన్న పరమాత్మ ఒక్కటేనన్న జ్ఞానాన్ని నాలో పెంపొందించుకోవడానికి గురువుగారు అంతకంతకూ నాకు సహాయ పడుతున్నారని తెలుసుకుంటున్నాను.

— డి.సి.హెచ్. టెక్సాస్

“ఈశ్వరుడితో సంపర్కం పొందడానికి, అన్ని పరిస్థితులలోనూ, అందరు మానవులూ ఉపయోగించ దగిన ఒక నిశ్చితమైన విధానం ఉన్నదన్న గ్రహింపు చాలా మంది సెల్ఫ్-రియలైజేషన్ విద్యార్థులకు ఒక విముక్తిదాయకమైన దిగ్భ్రాంతిని కలిగించింది. తామొక కొత్త జన్మ ఎత్తినట్టు వారు భావించారు.”

 

అతడి ఆత్మ యొక్క అంధకార నిశిలోకి ఆత్మసాక్షాత్కార కాంతి ప్రవేశించింది. పరమహంస యోగానందగారి బహిరంగ ఉపన్యాసాలకు హాజరైన తరువాత, తరగతి పాఠాలు అందుకోక ముందే ఈ వ్యక్తి తన హృదయం నుండి ఎంతో బరువైన నిరాశ భారం తొలగించబడిన భావన పొందాడు. బహిరంగోపన్యాసాలలో చివరి దాని నుండి ఇంటికి వెళ్తూనే తనలో ఎంతో గొప్ప శాంతి అతడికి ఎరుకలోకి వచ్చింది. ఒక లోతైన మౌలిక విధానంలో తానొక భిన్నమైన వ్యక్తిగా మార్పుచెందానని అతడు గుర్తించాడు. తన గదిలోని అద్దంలోఆ కొత్త వ్యక్తిని చూడాలని అతడికి ప్రేరేపణ కలిగింది. అందులో అతడు తన ముఖాన్ని కాక ఎవరి ప్రసంగాన్ని ఆ సాయంత్రం తాను విన్నాడో ఆ పరమహంస యోగానందగారి ముఖాన్ని చూశాడు.

తన ఆత్మలో ఆనందపు వరద గేట్లు తెరుచుకున్నాయి; వర్ణనాతీతమైన పరమానంద తరంగాల వెల్లువలో అతడు ముంచెత్తబడ్డాడు. ఇంతకు ముందు తనకు కేవలం పదాలుగానే తెలిసిన పరమానందం, అమరత్వం, శాశ్వతత్వం, సత్యం, దివ్య ప్రేమ ఇవన్నీ రెప్పపాటులో అతడి జీవన సారమూ, ఏకైక సత్యమూగా అతడి అస్తిత్వ అంతర్భాగమయ్యాయి. ఈ గాఢమైన, శాశ్వతమైన ఆనందపు నీటిఊటలు ప్రతీ హృదయంలోనూ ఉన్నాయని, ఈ శాశ్వత జీవం, మానవ జీవితపు మర్త్యత్వం క్రింద అంతటా పరచుకొని ఉన్నదని, ఈ శాశ్వత, సమస్తాన్నీ కలుపుకొన్న ప్రేమ ప్రతీ కణాన్నీ, పరివేష్టించి దానికాధారాన్నిచ్చి, మార్గదర్శకత్వాన్ని అందిస్తోందని అతడికి నిస్సందేహంగా, నిశ్చయతతొ గ్రహింపుకు రావడం వల్ల, అతడి అస్తిత్వమంతా (ఈశ్వరుడి పట్ల) ప్రశంస, కృతజ్ఞతలతో వెల్లువెత్తి ప్రవహిస్తోంది.

అతడు ఎరిగి ఉన్నాడు; తన మనసుతో మాత్రమే కాదు, తన హృదయమూ, మరియు ఆత్మలతో, తన శరీరంలోని ప్రతి అణువూ, మరియు కణములతో. ఈ గ్రహింపులోని ఉత్కృష్ట సౌందర్యం, ఆనందం ఎంతో ఘనమైనవి, అలాంటి వాటి వల్ల ఇంతటి ఆనందం పొందగలిగితే…దానివల్ల శతాబ్దుల, సహస్రాబ్దుల, అసంఖ్యాక యుగాల వేదన ఏమీ లేనట్టే అయిపోతుంది. పాపమూ, దుఃఖమూ, మరణమూ — ఇవి కేవలం పదాలు మాత్రమే, అర్ధం లేని పదాలు. ఆనందం చేతమింగబడిన పదాలు — ఏడుసముద్రాలు చిన్నిచిన్ని చేపలను మింగివేసినట్టు.

శారీరక మార్పులు

అతడు తన ఈ మొదటి జ్ఞానోదయసమయంలోనూ, ఆ తరువాతి వారాల్లోనూ తనలో ఎన్నో శారీరిక మార్పులు సంభవించడం గమనించాడు. అన్నిటిలోకీ అద్భుతమైంది తన మెదడులోని కణజాల అమరిక పునర్నిర్మితమవడం, లేక అక్కడ ఒక కొత్త అణు భూభాగం తెరుచుకోవడం. రాత్రి, పగలు నిరంతరాయంగా ఈ పని జరుగుతూండడం అతడికి అనుభూతమైంది. నూతన కణజాల ఆలోచనా ప్రవాహ మార్గాల ఏర్పాటుకు ఒకరకమైన బరమా యంత్రం పని చేస్తున్నట్టు అనిపించింది. విశ్వ చేతన అనేది మనిషిలోని సహజ సామర్థ్యం ఎందుకంటే ఈ శక్తితో సంబంధం ఉన్న కణాలు ఇప్పటికే మనిషిలో ఉన్నాయి కానీ స్తబ్దంగా లేదా అధిక శాతం మానవులలో ప్రస్తుతం నిష్క్రియాత్మకంగా ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఋజువు అన్న బ్యూక్ సిద్ధాంతానికి బలమైన సాక్ష్యంగా నిలుస్తుంది.

మరొక ముఖ్యమైన మార్పు అతడి వెనుబాములో అనుభూతమయింది.మొత్తం వెన్ను అంతా ఇనుముగా మారి తాను ఈశ్వరుడిపై ధ్యానానికి కూర్చుంటే ఏమాత్రం కదలిక గానీ, శరీర స్పృహ కానీ, శరీరం ఏ విధమైన పని చేయడం కానీ లేకుండా ఒకే ప్రదేశంలో పాతుకుపోయినట్టు శాశ్వతంగా కూర్చుండ గలిగేవాడు. అప్పుడప్పుడు మానవాతీత శక్తి ఒక్క ఉదుటున అతడినలోకి ఉప్పెనలా చొచ్చి అతడిని ఆక్రమించేది, అప్పుడతడు మొత్తం ప్రపంచా న్ని తన భుజాలమీద మోస్తున్నట్టు అనుభూతి పొందేవాడు. జీవన మధువు, అమర్త్యత్వపు మకరందం అసలైన, గుర్తించదగిన శక్తిగా తన రక్తనాళాల్లోకి ప్రవహించడాన్ని అనుభూతి చెందాడు. అది తన శరీరమందంతటా పాదరసం వలే, ఒక విధమైన విద్యుత్ కాంతి ప్రవాహం వలె తోచింది.

అతడికి అధ్యాత్మికానుభవం కలిగిన ఆ కొద్ది వారాలు ఆహారమూ, నిద్రా అవసరం లేకపోయాయి. అయినా తన బాహ్య జీవితాన్ని తన కుటుంబ పద్ధతిలో నే గడుపుతూ, వారితో పాటు తానూ భోజనం చేయడం, నిద్ర పోవడం చేసేవాడు. ఆహారం అతడికి స్వచ్చమైన ఆత్మ రూపంగా కనిపించేది. నిద్రలో దిండుగా ఆ అమర హస్తాలమీద తల పెట్టుకొని, మాటలకతీతమైన ఆనందంలోనూ, వర్ణనాతీతమైన శక్తిలోనూ మేలుకొంటూ ఉన్నాడు.

అతడు గతంలోచిరకాలంగా బాధిస్తున్నజలుబుతో ఇబ్బంది పడ్డాడు; ఇప్పుడతడి శరీరము అన్ని అనారోగ్యాల నుండి పరిశుద్ధమైంది. అతడి కుటుంబమూ, స్నేహితులూ అతడి రూపంలో, వైఖరిలో వచ్చిన గొప్ప మార్పును గుర్తించారు; అతడి ముఖం ఒక ప్రకాశమానమైన కాంతితో వెలుగుతోంది; అతడి కళ్ళు ఆనంద సరోవరాలవలే ఉన్నాయి.కొత్తవారు అతడి పట్ల ఒక ప్రబలమైన సహానుభూతితో ఆకర్షితులయ్యేవారు; ట్రామ్ బండి లో ప్రయాణం చేసేటపుడు పిల్లలు వచ్చి అతడి ఒడిలో కూర్చుని తమ ఇంటికి రమ్మని పిలిచే వారు.

ఇతర వై.ఎస్.ఎస్. /ఎస్.ఆర్.ఎఫ్. క్రియాయోగుల అనుభవాలు

నేను 45 ఏళ్లుగా క్రియాయోగ సాధన చేస్తున్నాను. 20 ఏళ్ళకు పైగా నా ధ్యానం పొడి పొడిగానే ఉండేది, కానీ నేను రోజుకు రెండుసార్లు నా సాధన నిలకడగా చేస్తూనే వచ్చాను. ఇప్పుడు, ఆ అనంతర సంవత్సరాల్లో మాటల్లో వర్ణించలేని దీవెనలు నా స్వంతమయ్యాయి. ఇటీవల గాఢమైన ధ్యానం తరువాత నేను గురువుగారిని “వైశ్విక శాంతి (Cosmic Peace) అంటే ఏమిటి” అని అడిగాను. అప్పుడు నిశ్శబ్దంగా ఉంది. నేను మరింత గాఢంగా ధ్యానంలోకివెళ్లాను, అప్పుడు క్రమంగా ఒక ఆనంద శాంతి తరంగం క్రింది వెన్నులోంచి పై చక్రాలకు ఎగబాకి, శరీరమంతటా వ్యాప్తి చెందింది- అప్పుడు అంతకు ముందెన్నడూ ఎరుగని శాంతి అనుభూతమయింది. ఆ శాంతి తరంగంలో ఈ శరీరంలోని అన్నీ పరమాణువులూ విశ్వ ధార్మిక సమస్త స్పందనలతో పరిపూర్ణమైన అనుశ్రుతిలో అనునాదం చెందడాన్ని నేను గ్రహించాను. ఈ పరమానందకర శాంతిలో శరీరం కరిగిపోతూండడాన్ని, ఆత్మ ఆరోహణ చెందుతూ, ప్రేమ తరంగాలలో వ్యాకోచిస్తూండడాన్ని అనుభవించాను. ఇంకా గాఢమైన ధ్యానంలో నా ఆత్మ మరింత ఉన్నతతర ఆనందభరిత శాంతి స్థాయిలోకి –స్పందనారహిత, పరిపూర్ణ, మధుర నిశ్చలతలోకి ప్రవేశించింది. అప్పుడు కొద్దిసేపు నేను ఇంటికి వచ్చాను అన్న గ్రహింపు నాకు కలిగింది. ఈ అనుభవంతో “విశ్వ శాంతి అంటే ఏమిటి” అన్న నా ప్రశ్నకు నా గురువు సమాధానాన్ని నేను గుర్తించాను.

 — ఎస్.బి., జార్జి

అతడికి జగత్తంతా ప్రేమ సముద్రంలో మునిగిపోయింది; అనేకసార్లు తనకు తాను ఇలా చెప్పుకున్నాడు. చివరికి “ఇప్పటికి ప్రేమ అంటే నాకు తెలిసింది. ఇది భగవంతుడి ప్రేమ, అతి గొప్ప మానవ ప్రేమను కూడా తలదన్నేది. శాశ్వత ప్రేమ, అసాధ్యమైన ప్రేమ, సర్వ సంతృప్తినిచ్చే ప్రేమ!” ఈ విశ్వాన్ని సృష్టించి, పోషించేది నిస్సందేహంగా ప్రేమే అని సృష్టింపబడిన సమస్తమూ, మానవులూ, అల్ప జీవులూ కూడా కేవల జీవన సారమైన ఈ ప్రేమను, ఈ శాశ్వతానందాన్ని ఎప్పటికైనా కనుగొని తీరవలసిందే అని అతడు తెలుసుకొన్నాడు. తన మనసు సృష్టిలో ఉన్న ప్రతి దాన్నీ తాకుతూ, అన్నిటినీ కలిపి ఉంచుతూనిరంతరాయంగా విశాలమవుతూ, పెద్దగా అవుతూ, విస్తరిస్తూ, తన అవగాహన అన్నిటినీ చేరుకుంటున్నట్టు, తానే సమస్తానికీ కేంద్రమైనట్టు, అంతటా కేంద్రము ఉండి, పరిధి ఎక్కడా లేనట్టు ఆతడున్నాడు.

ప్రకృతి యొక్క పరమాణు నాట్యము

తాను పీల్చుతున్న గాలి స్నేహంగా, ఆత్మీయంగా, ప్రాణంతో ఉన్నట్టు అతడికనుభూతమైంది. ప్రపంచమంతా తనకు ఇల్లయినట్టు, ఏ ప్రదేశమూ తనకు ఎప్పటికీ కొత్తది కానట్టూ, కొండలు, సముద్రమూ, తానెన్నడూ చూడని సుదూర ప్రదేశాలూ ఇవన్నీ కూడా తన చిన్నప్పటి ఇల్లు ఎంత ఆత్మీయమైనదో అంతగా తన స్వంతమైనట్టూ అతడికి భావన కలిగింది. ఎటు చూసినా ప్రకృతి యొక్క “పరమాణు నాట్యం” అతడు చూశాడు. గాలి అంతా కదులుతూ ఉన్న కోట్లాది సూక్ష్మ కాంతి రేణువులతో నిండి ఉంది.

ఈ వారాల్లో అతడు తన రోజువారీ కార్యక్రమాలు మామూలుగా నిర్వహించాడు కానీ అంతకు ముందెన్నడూ లేని సామర్ధ్యమూ, వేగమూ అందులో ఉన్నాయి. టైప్ చేసిన కాగితాలు తనెప్పుడూ చేసేదానికి నాలుగవ వంతు సమయంలో, ఒక్క తప్పు కూడా లేకుండా మిషన్ నుండి వెలువడ్డాయి. అలసట అనేది అతడికి తెలియనిదైంది. తన పని పిల్లలాట లాగ ఆనందకరంగా, అలవోకగా అనిపించింది. తన క్లయింట్లతో ఫోనులో కానీ, ప్రత్యక్షంగా కానీ మాట్లాడేటప్పుడు అతడిలోని ఆంతరిక ఆనందం, ప్రతీ పనినీ, ప్రతీ పరిస్థితినీ ఒక వైశ్విక ప్రాధ్యాన్యతతో కప్పివేసింది. ఎందుకంటే అతడికి ఈ మనుషులు, ఈ టెలిఫోన్, ఈ బల్ల, ఈ స్వరం అంతా ఈశ్వరుడే, ఈశ్వరుడే తన సమ్మోహకరమైన మారు రూపాల్లోని మరొక రూపంలో తనను తాను వ్యక్తం చేసుకొంటున్నాడు.

తన పని మధ్యలో అతడు ఒక్కసారిగా తాజాగా తనకు ఈ నమ్మలేని, చెప్పశక్యం కాని ఆనందాన్ని ప్రసాదించిన భగవంతుడి మంచితనానికి పరమానందభరితుడవుతాడు. ఆలాంటి సమయాల్లో అతడి శ్వాస పూర్తిగా ఆగిపోతుంది; అతడు పొందిన ఆ విస్మయానికి అనుబంధంగా అంతరిక, బాహ్య పరిపూర్ణ నిశ్చలత సంభవిస్తుంటుంది. అతడి చైతన్యమందంతటా అపరిమితమైన, అవ్యక్తమైనకృతజ్ఞత నిండిపోతుంది; తమ లోపల ఎంతటి ఆనందం దాగి ఉందో ఇతరులు కూడా తెలుసుకోవాలన్న తపన; కానీ అన్నిటికంటే, మానవ గ్రహింపుకు అందని ఒక దివ్యజ్ఞానం, ప్రపంచమంతా బాగుందని, ప్రతిదీ విశ్వ చైతన్యం, శాశ్వతానందం అనే లక్ష్యం వైపుకు నడిపిస్తుందన్న జ్ఞానం. ఈ ఆనంద భరిత స్థితి అతడిలో రెండు నెలలపాటు ఉండి తరువాత మెల్లగా చెదిరిపోయింది. ఆ స్థితి ఆ ప్రథమంలో లాగు పూర్తి శక్తి వంతంగా మళ్ళీ ఎన్నడూ రాలేదు కానీ, కొన్ని లక్షణాలు — దివ్యానందమూ, శాంతీ — అతడు సెల్ఫ్-రియలైజేషన్ ధ్యాన ప్రక్రియలు సాధన చేసినప్పుడల్లా వస్తుండేవి.

“యోగ సాధన భగవత్కృపను ఉత్కృష్ట స్థాయిలో అందిస్తుంది”

జ్ఞానమాత పరమహంస యోగానందగారి అత్యంత ఉన్నత స్థాయి క్రియాయోగ శిష్యులలో ఒకరు. ఇతర శిష్యులకు ఆమె ఇచ్చిన ప్రేమ పూరిత, జ్ఞానయుక్తమైన బోధనలు “గాడ్ అలోన్: ది లైఫ్ అండ్ లెటర్స్ ఆఫ్ ఎ సెయింట్” అన్న పుస్తకంగా సంకలితమయాయి. 1951 లో ఆమె మరణించిన తరువాత గురువుగారు జ్ఞానమాత పూర్తిగా ముక్తిని సాధించారని ఇతర శిష్యులకు తెలిపారు. పరమహంసగారు ఇలా అన్నారు:

[ఆమె వెళ్లిపోవడానికి రెండు రోజులముందు] ఆమె నన్ను నిర్వికల్ప సమాధి కోసం అడిగింది; కానీ నీకది అవసరం లేదు అని నేనన్నాను. నేను నిన్ను భగవంతుడిలో చూశాను. నీవు భవనంలోకి ప్రవేశించాక ఇంకా తోటలోకి వెళ్ళాలని ఎందుకనుకుంటావు?

ఆమె తన కర్మను తన పూర్వ జన్మ లోనూ, ఈ జన్మలోనూ అనుభవించి పూర్తి చేసుకొంది. ఇంకా ఆమె ఆ ఉన్నత పరమానంద స్థితి లేకుండానే ఆ పరమ పిత కృప వల్ల ఈ జన్మలో శాశ్వత విముక్తికి పాత్రురాలైంది. అంటే దీనర్ధం ఆమె ఆ ఉత్కృష్ట పరమానంద స్థితిని (నిర్వికల్ప సమాధి). పొందలేదని కాదు. అది ఆమె పూర్వ జన్మ లో పొందింది. కానీ ఆమె తన గదిలో ఒక చిన్న కార్డు మీద వ్రాసి పెట్టినట్టు : “గాడ్ ఆలోన్” [దేవుడు మాత్రమే] ఈ జన్మ లో బాధలకు చెక్కు చెదరని విజయవంతమైన ఆమె ఆత్మను దైవ కృప మాత్రమే సర్వవ్యాప్త విముక్తిలోకి ఉద్ధరించింది…

భక్తులందరూ గుర్తుంచుకోవలసినదేమిటంటే, కేవలం నిరంతర యోగ సాధన మాత్రమే భగవంతుడి కృపను అత్యున్నతంగా మనకందిస్తుంది. ఎందుకంటే కృష్ణుడు అర్జునునితో ఇలా అన్నాడు:” ఓ అర్జునా, జ్ఞానమార్గం కంటే, కర్మమార్గం కంటే, లేక ఏ ఇతర మార్గం కంటే కూడా యోగమార్గం గొప్పది. కావున అర్జునా, నీవు యోగివి కమ్ము!”

ఇతరులతో షేర్ చేయండి