గురుదేవుల ఆశయ సాధన

స్వామి శ్యామానంద గిరి ధృడచిత్త జీవనము

శ్రీ వినయేంద్ర నారాయణ్ భారతదేశములోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రం బాందాలో శ్రీ గోకుల్ ప్రసాద్ నారాయణ దుబే దంపతులకు 1911 మే నెల 4వ తేదీన జన్మించారు. వీరు లాస్ ఏంజిలిస్ లోని యోగదా సత్సంగ సొసైటీ ఆఫ్ ఇండియా/సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్ యొక్క అంతర్జాతీయ ప్రధాన కార్యాలయములో 1971 ఆగష్టు 28న స్వామి శ్యామానంద గిరిగా తనువు చాలించారు. వీరి జీవితంలోని ఘటనల పరంపర ఒక గొప్ప స్ఫూర్తిమంతమైన చరిత్రగా నిలుస్తాయి. ఓరిమి, అంకితభావము, నిస్వార్థసేవల వారసత్వంగా తన తరం వారికి, రాబోయే తరాలకు కూడా వారి జీవితం ఓరిమికి చిహ్నంగా అంతేకాక వారి సేవలు ఆయనను చిరస్మరణీయులుగా నిలుపుతాయి.

వీరి ఎత్తు, రూపం ఆయనకొక గౌరవాన్ని తీసుకువస్తుంది; ఇంకా వీరి సామర్థ్య నైపుణ్యాలు నాయకత్వాన్ని, విశ్వసనీయతను కలుగచేస్తాయి. ఈ లక్షణాలే ప్రపంచం ఈయనకు ఏ సంశయ సందేహాలు లేకుండా దారి పలికింది. వీరి అంతరంగం తెలిసిన వారందరికీ ఆయన తన బేషరతు ప్రేమను పంచారు. నిజానికి జీవిత వసంతాలు గడిచేకొద్ది వీరి అంతరంగం పూర్ణ బాహ్యతత్వంగా ప్రస్ఫుటమయ్యింది.

“ఇతను సామన్య బాలుడు కాదు. ఈ సాధారణ ప్రపంచానికి సంబంధించినవాడు కాదు. ఇతని జీవిత విధానము ముందుగానే నిర్ణయించబడింది. వారి దారిన వారిని వెళ్ళనీయండి.” శ్రీ నారాయణ్ దుబే మూడేళ్ళ వయస్సులో వీరి తల్లి, తన బిడ్డ గురించి ఇలా జోస్యము చెప్పి తన మూడేళ్ల పసిబిడ్డను ఆయన ఇద్దరి అక్కలను, వీడి పరలోక ప్రాప్తి పొందారు. ఆ తల్లి తన బిడ్డ భవిష్యత్తును తన మనోనేత్రంతో దర్శించిందేమో! లేదా అప్పుడే నడక నేర్చిన తన బిడ్డ పక్కనే ఉన్న గుడి పరిసరాలకు తన అంతట తానే నడిచి వెళ్ళడం చూడటం వల్ల అయ్యుండవచ్చు!

“నేను దేవాలయానికి ఎందుకు ఆకర్షితుడనయ్యానో తెలియనంత చిన్నతనం నాది” అంటూ శ్యామానందగారు తన బాల్యం గుర్తు చేసుకుంటూ అనేవారు. “నేను అక్కడ ఉన్నప్పుడు ఆ గుడి నాకు ఇల్లులా అనిపించేది. కానీ నేను ఇంటిలో కనపడకపోవడం మావాళ్ళ ఆందోళనకు కారణమయ్యేది దాంతో తరచుగా నాకు తిట్ల దండనలు పడేవి. ఇది నాకు అంత ఆనందకరమైనదేమీ కాకపోయినా ఇది నా అలవాటును మార్చలేకపోయింది. భగవంతుడు సర్వవ్యాపి అనే వేదవాక్కు బాలుడైన బినయేంద్రపై గట్టి ప్రభావాన్ని చూపింది. చెట్లు, పక్షులు, ఆకాశము ఇలా అన్నింటిలోనూ భగవంతుణ్ణి నేను వెదికేవాణ్ణి. ఆ చింతనలోనే పూలను తదేకంగా చూస్తూ, ‘హే కృష్ణా! నీవు ఇక్కడ ఉన్నావా!’ అని అడిగేవాడిని.

“నా బాల్యంలో ఆధ్యాత్మిక గ్రంథాలలోని కథలను వినడమంటే నాకు చాలా ఇష్టం” అంటూ శ్యామానందజీ కొనసాగించారు. ఆయనకు ప్రతి నీతి , ఆదర్శము శాసనముగా మారిపోయేది. ఆ పురాణాల్లోని నాయకులను, అవతార పురుషులను తన తోటి పిల్లల వలె నిజమైనవారుగా భావించేవాడు. వినయేంద్ర కిండర్ గార్టెన్ స్కూల్లో చదివే రోజుల్లో క్లాస్ అయ్యిన తరువాత ఒక్కడే ఉండిపోయి స్కూల్ ప్రాంగణంలో ఆడుకుంటున్నాడు. సంధ్యాకాలం మొదలయ్యింది. విద్యుత్ దీపాలు లేని రోజులవి. శ్యామనందజీ చెప్పసాగారు, “ఉన్నట్లుండి ఆ ప్రదేశము మొత్తము గొప్ప వెలుగుతో నిండిపోయింది. ఆ వెలుగులో నాకు హనుమంతుని దర్శనమయ్యింది. మామూలు పిల్లలయితే పెద్ద వానర రూపంలోనున్న హనుమంతుని చూచి భయపడి పరుగెత్తి వెళ్ళేవారు. కాని నాకు చాలా అందమైన అనుభూతి కలిగింది, నేను హనుమంతుని వైపు నెమ్మదిగా నడవసాగాను. అయితే హనుమంతుని రూపం నెమ్మదిగా ఆ కాంతిలో లీనమయ్యింది; ఆ తరువాత కాంతి కూడా అదృశ్యమయ్యింది. ఆ ఆనందదాయక దృశ్యము చాలా కాలము నా మనస్సులో నిలిచిపోయింది.” వానర రూపంలో అవతరించిన హనుమంతుణ్ణి గొప్ప దేవుడుగా భారతీయులు పూజిస్తారు. వాల్మీకి మహర్షి రచించిన రామాయణ ఇతిహాసంలో అసాధ్యమయిన ఎన్నో కార్యాలను సుసాధ్యం చేసిన ఘనుడు హనుమంతుడు. హనుమంతుడు పరిపూర్ణ భక్తుడికి ప్రతీక. తనకు తాను ఒక నిస్సహాయ, అజ్ఞానపు చిన్నవానరం, కానీ భగవంతుడు తనకు ఇచ్చిన పనిని నెరవేర్చడానికి భగవంతుడి పేరును తీసుకున్నప్పుడు, ఆయన ఒక పెద్ద దిగ్గజం అవుతాడు, ఆయన పరాక్రమం సాటిలేనిది; ఆయనకి ఏదీ అసాధ్యం కాదు. అదే విధముగా శ్యామానందగారు కూడా దైవము మరియు గురుదేవులు పరమహంస యోగానందగారి పట్ల ఉన్న అచంచల భక్తి ప్రపత్తులతో సాధించిన అద్భుత కార్యాలను ప్రస్తావిస్తూ చాలా సందర్భాలలో శ్రీదయమాతగారు ఆయనను “పరమహంస యోగానందుల వారి హనుమాన్” అంటుండేవారు.

శ్రీ వినయేంద్ర నారాయణ్ తొమ్మిది సంవత్సరాల వయస్సులో ఆయన తండ్రి చనిపోయారు. వినయేంద్ర తండ్రిగారు, రాజబహదూర్ సతిప్రసాద్ గారు చిరకాలంగా మంచి మిత్రులు. వారిరువురి అవగాహన ప్రకారం వారిద్దరిలో ఎవరైనా ముందే చనిపోతే, బ్రతికున్నవారు చనిపోయినవారి బిడ్డలను దత్తత తీసుకొని పోషించాలి. కావున శ్రీ వినయేంద్ర కలకత్తాకు దగ్గరున్న మిడ్నాపూర్ జిల్లాలో తన తండ్రి స్నేహితుడు రాజబహదూర్ సతిప్రసాద్ గార్గా గారి మహిషాదల్ లోని విశాల భవంతిలో పెరిగాడు. దత్తపుత్రుడు శ్రీ వినయేంద్రను ఇంటికి పెద్ద కొడుకుగా ప్రేమ వాత్సల్యాలతో పెంచారు.

ఈ నవ యువకుడు తన క్రొత్త తండ్రిని ఎంతో ఆరాధించేవాడు; నిజానికి రాజా గార్గా కూడ దీనికి అర్హుడే అని మాకు తెలిసింది. ఎందుకంటే ఆయన ఉన్నత లక్షణాలు కలిగి అసాధారణ ప్రజ్ఞాపాటవాలు మరియు విజయ సాఫల్యాలే కాక శాస్త్రాలలోను (హిందూ పురాణాలలో) ఇంకా భారతదేశ ప్రాచీన సంస్కృత సాహిత్యంలోనూ పట్టు కలిగిన వాడు. ఆయనకు అత్యంత సన్నిహిత మిత్రుడు శ్రీ రాందయాల్ ముజుందార్. ఈయన శ్రీ రాంగోపాల్ ముజుందార్ [1] గారి తమ్ముడు. శ్రీ రాంగోపాల్ ముజుందార్ క్రియాయోగ దూత, అయిన శ్రీ శ్రీ లాహిరీ మహాశయుల ముఖ్య శిష్యుడు. శ్రీ శ్యామనందగారు గతం అవలోకనం చేసుకునేటప్పుడు శ్రీ రాజా గార్గా కూడ క్రియాయోగి అయి ఉండవచ్చునని అనుకునేవారు.

సంస్కృత కళాశాల ప్రిన్సిపాల్ గా రిటైరైన శ్రీరామ్ దయాల్ ముజుందార్ అత్యంత గౌరవనీయుడైన గొప్ప ఆధ్యాత్మిక మూర్తి. వీరు సంస్కృత భాషలోని భగవద్గీత గ్రంథాన్ని (సంస్కృతం నుండి బెంగాలీ భాషలోనికి) అనువదించి, వ్రాసిన వ్యాఖ్యానం బాల్యదశలో వినయేంద్ర చదివిన మొట్టమొదటి పవిత్ర గ్రంథం. ఈ రాందయాల్ ముజుందార్ పండితుడే వినయేంద్రకు చదువు చెప్పినాడని ఒక వదంతి ఉంది. అయితే వినయేంద్ర అప్పుడు చాలా చిన్నవాడు, అంతేకాక అతను ప్రాథమిక తరగతిలో ఉన్నాడు. ఏది ఏమైనా ఈ బాల వినయేంద్రను శ్రీ రాందయాల్ ఆధ్యాత్మికంగా ప్రభావితం చేసి వినయేంద్రకున్న భక్తి తత్పరతను ప్రోత్సహించారు. తరువాత శ్రీ శ్యామానంద ఒక సందర్భములో ఇలా అన్నారు, “నాకు చాలా కాలం ఆయన సెల్ఫ్-రియలైజేషన్/యోగదా గురు పరంపర శిష్యులని, అది కూడా నేను యోగదా సత్సంగ సొసైటీ పనులు చేపట్టేంతవరకు నాకు తెలియలేదు. 1919 సొసైటీ తీర్మానాలలో రాంచీ విద్యాలయ పాలక మండలిలో సభ్యుడిగా, శ్రీ పరమహంస యోగానందగారు, స్వామి శ్రీయుక్తేశ్వర్ గారు, తదితరులతో పాటు రాందయాల్ ముజుందార్ గారి పేరు కూడా చూసినపుడు నాకెంతో సంభ్రమాశ్చర్యాలు కలిగాయి.”

స్వామి శ్యామానంద గిరి 1911 - 1971

శ్రీ వినయేంద్రకు పదకొండు సంవత్సరాల వయస్సున్నప్పుడు, పూజ్యులు గోవింద బ్రహ్మర్షి అనే సాధువు వీరి ఇంటికి రావడం జరిగింది. ఈయన వినయేంద్రలోని సహజ ఆధ్యాత్మిక లక్షణాలకు అత్యంత ఆసక్తి చెందారు. ఈ సాధువు కూడ ఇతను సామాన్య బాలుడు కాడని గుర్తించాడు. “ఆ సమయంలో ప్రాపంచిక లక్ష్యాలన్నిటినీ పరిత్యజించి, ఆ సాధువుతో వెళ్ళి పోవాలని భావించేవాడినని” శ్రీ వినయేంద్ర గుర్తు చేసుకున్నారు, “కాని ఆ సాధువు ఇంకా నీకు ఆ సమయం రాలేదు” అని నాతో అన్నారు. ఆయన వెళ్ళిపోయినప్పుడు వినయేంద్రగారి హృదయము దుఃఖభరితమైంది. ఆ సాధువు తిరిగి వచ్చే సమయం ఆసన్నమయినదని అనుకుంటన్నప్పుడు, వారు మహాసమాధి చెందారన్న వార్త వారికి అందింది.

భారతదేశ రాజ కుటుంబాలలో ఒకరైన గార్గా రాజుగారి పరిపాలన క్రింద అయిదువందల గ్రామాలు ఉండేవి. వినయేంద్రుని విద్యాభ్యాసంలో భాగంగా పరిపాలన విధులను, కార్యనిర్వహణ బాధ్యతలను “యువరాజు” హోదాలో నేర్చుకుంటుండేవాడు. కాలేజీలోని శిక్షణలో ప్రపంచ చరిత్రను ముఖ్య అధ్యయనంగా చదివారు, యుక్త వయస్సుకు వచ్చేసరికి బారిస్టర్ (లాయర్) కావాలనుకొన్నాడు. వినయేంద్రలోనున్న కుశాగ్రబుద్ధి, అసాధారణ జ్ఞాపకశక్తి, దృఢసంకల్పము వలన ఏ రంగంలోనయినా, ఆయన మనస్సు పెట్టినదేదైనా సరే అనుకున్నది సాధించేవాడు—అది చదువులోనైనా, ఆటల్లోనైనా, లేదా అడవిలో పులులను వేటాడటమైనా.

యుక్త వయసు రాగానే వినయేంద్రుడు “శంతన” అనే అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సుతిమెత్తని హృదయంతోపాటు మంచి వివేకము కలగలిసిన స్త్రీ మూర్తి ఆమె. వినయేంద్ర తన మానసిక, ఆధ్యాత్మిక సహచరిణిగా ఆమెను గౌరవించేవాడు. వినయేంద్రలోని అత్యంత ప్రశంసనీయమైన లక్షణం ఆయన తన భార్యను ఎంతో గౌరవ భక్తి భావంతో వ్యవహరించడం—అరుదైన లక్షణం , భార్య భర్తల సంబంధంలో మరీనూ. ఆయన తరచు ఇలా అంటుండేవాడు: “ఆమె ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఆమెకు నేను సరియైన జోడీ కాను!” సంసార జీవితంలో వీరికి ఇరువురు కుమార్తెలు పుట్టారు. వారి పేర్లు దీప్తి మోయిదేవి, ప్రీతి మోయిదేవి వారిని ప్రేమగా మీరా, మిను అని పిలిచేవారు.

సాధారణంగా ప్రతి పురుషుడూ కోరుకునే గుణాలన్నీ వినయేంద్రకు ఉన్నాయి. అయినప్పటికి ఆయన అనేకసార్లు “నేను దేనికీ తగిన వాడను కాను; నేను దేనికీ చెందినవాడను కాను. వేరే ఏదో నన్ను ఎప్పుడూ లాగుతూ వుంది” అని అంటుండేవారు. జీవితంలో ఉన్నత విధులు నెరవేర్చుటకు భగవంతునిచే స్పృశించబడిన ప్రతీ ఆత్మ భావించేటట్లుగానే. అయితే ఆయన తన జీవితంలో ఎప్పుడు పశ్చాత్తాపంతో కుమిలిపోలేదు. ఆయనలో నైరాశ్యమూ కానరాలేదు. ఇవే కాదు జీవితంలో ఎటువంటి ప్రతికూలాత్మక భావనలయినా తిరస్కరించే తత్వం ఆయనిది. “నేను ఎల్లప్పుడు నమ్మేది, ఉల్లాసంగాను, సకారాత్మకంగాను ఉండటం, అంతేకాదు ఏ పని చేసినా, దానిని చక్కగా సమర్ధవంతముగా చేయడం!” ఇదే ఆయన జీవిత ప్రతిన.

శంతన తన భర్తలో ఎటువంటి కష్టాన్నయినా ఎదుర్కొనే సామర్థ్యం ఉందని గ్రహించింది. తన సామాజిక అవసరాలు కూడా వినయేంద్ర పట్టించుకొనేవాడు కాదు; అతడొక అతి సనాతన బ్రాహ్మణుడు. ఆయన ఒక్క చుక్క నీరు కానీ చిన్న మెతుకు కానీ తీసుకోవాలన్నా, దానికి సంబంధిoచిన పవిత్ర గ్రంథముల నియమాలను తూచ తప్పకుండా పాటించేవారు. ఏ పని చేసినా ధృఢ సంకల్పంతోనూ, ఉత్సాహంగానూ చేసేవాడు. చాలా సందర్భాలలో అతిగా వెళ్ళేవాడు. మహాత్మాగాంధీజీ చేయని పద్ధతిలో తాను ఉపవాసం చేయాలనుకున్నాడు. నీళ్ళు కూడా త్రాగకుండా నిరాహార దీక్ష చేశాడు. ఇలా చేయడము వలన ఆయనకు ప్రాణాపాయ స్థితికూడా తలెత్తింది. ఎందుకంటే మహాత్మా గాంధీజీ తాను నిరాహార దీక్షను చేపట్టినప్పుడు నీరు త్రాగుతుండేవారు. శారీరక శ్రమతో కూడిన పనులు చేసేవారు కాదు. వినయేంద్ర ఆహారము తీసుకోకుండా నీరు త్రాగకుండా మండుటెండలో తన సాధారణ దైనందిన అధ్యయనంలోను, ఆటలలోనూ మామూలుగా పాల్గొనేవాడు. అదికూడ కుటుంబములో ఎవరికీ తన నిరాహార దీక్ష గురించి తెలియకుండా జాగ్రత్త వహించేవారు. అయితే తొమ్మిది రోజుల తరువాత వినయేంద్రకు స్పృహ కోల్పోయే పరిస్థితి వచ్చింది. ఇది గమనించిన ఒక నౌకరు వినయేంద్ర భార్య శంతనకు తెలియచేశాడు. ఆమె వచ్చి నిరాహారదీక్షను బలవంతముగా విరమింప చేసింది. అప్పుడు అపరిమితంగా గ్లాసుల గ్లాసుల పాలు ఆరగించాడు అంతేకాదు పెద్ద చపాతీల దొంతర తినేశాడు. తన జీవితంలో అప్పుడు మాత్రమే కొంచెం అజీర్ణానికి గురి అయ్యానని ఆ తరువాత చెప్పారు వినయేంద్ర!

రాంచీ 1968 మార్చి 5, స్వామీజీ నొసట తిలకము దిద్దుతున్న శ్రీ దయామాత

శంతనగారు ఎప్పుడు నిశ్చేష్టులు అవ్వలేదని చెప్పేవారు, శ్రీ వినయేంద్రగారి ప్రతి సవాలుకి ఆమె సమాధానం చెప్పగలిగేవారు. శ్రీ వినయేంద్ర సాంఘిక ఆచారాలకు, కట్టుబాట్లకు దూరంగా ఉన్నా, శంతన ఏమాత్రం కలత పడకుండా నిశ్శబ్దంగా నవ్వుకునేవారు. ఒకరోజు శ్రీ వినయేంద్ర నిద్రలోనున్నప్పుడు, సనాతన ఆచార పరాయణులైన బ్రాహ్మణులు తల వెనుక పెంచుకునే, పిలక జుట్టును ఆమె కత్తిరించి వేసింది. (అయితే ఆ పిలక జుట్టు పోయిందన్న విషయం శ్రీ వినయేంద్ర గ్రహించినా ఆమెకు తెలియనివ్వలేదు, ఆ తరువాత దానిని తిరిగి పెంచనూలేదు) అలాగే తన భర్త ఏదైనా విషయంలో శృతి మించుతున్నప్పుడు మాత్రమే ఆమె అతనిని మెత్తగా మందలించేది. దానికి ఆయన కూడా అంగీకరించేవాడు. వారిరువురు ఆనందంగా ఉన్న సమయాలలో వేదాంతాన్ని గురించి ముచ్చటించుకొనే సందర్భం కూడా ఒకటి. అయితే ఆ రోజుల్లో భారతదేశ స్త్రీలకు వేదాంతములో ఎక్కువ పరిచయంగాని, జ్ఞానముగాని ఉండదనే భావన ఉండేది. ఆమెకు వేదాంత పరిజ్ఞానంతో బాటు అద్భుతమైన జ్ఞాపక శక్తి ఉండేది. ఏదైనా ఒక పుస్తకంలోని లేదా గ్రంథంలో గాని ఏదైనా ఒక పేజీ చూసిన తరవాత ఆ పేజీలోని పదం తరువాత పదం తిరిగి వల్లివేసేది. “ఈ విషయంలో కూడా ఆమె నన్ను మించిపోయింది” అని శ్రీ శ్యామానంద తన భార్యను గురించి గౌరవంగా గుర్తు చేసుకుంటూ అనేవారు.

శంతనకు ఇరువది సంవత్సరాల వయస్సులో ఒక దీర్ఘవ్యాధితో మరణించింది. “నాకు ఏ విధమైన దుఃఖం కలుగలేదు. ఎందుకంటే నా హృదయమంతా ఆమెతో నిండిపోయింది,” అన్నారు శ్రీ వినయేంద్ర. ఆమె నాతో అనేది “నాకు తెలుసు మీ జీవన విధానం ఇది కాదని. నేను మీకు ప్రతిబంధకం కాబోను. అలా అని ఎక్కువ కాలం పట్టుకొని ఉండను. మనం ఈ జీవిత నాటకం ఆడాల్సివచ్చింది; కానీ ఇప్పుడు దీనికి చరమాంకం పలకాలి, నేను మిమ్మల్ని బంధవిముక్తుడిని చేయాలి.”

అది జరిగింది 1936 సంవత్సరం. ఆమె మరణం తరువాత శ్యామానందగారి ఇద్దరు కుమార్తెల బాధ్యతను సహృదయరాలు మరదలు తీసుకున్నది. ఆ తరువాత శ్యామానందుల భగవదన్వేషణ 1936 నుండి జీవితాంతము వరకు కొనసాగింది. ఇల్లు వదిలి దాదాపు 23సం||లు (1936 నుండి 1959 వరకు) భారతదేశ ఆశ్రమాలు, పుణ్యక్షేత్రాలలో గడిపారు. ఎందరో గురువులను, సాధువులను సేవించారు; కొంతమంది సాధువులు వినయేంద్రుని భక్తిని, శక్తి సామర్థ్యాలను ఆశ్రమ నిర్మాణాలకు ఉపయోగించుకొని, ఆయన ఆధ్యాత్మిక అభివృద్ధికి ఆశ్రమం వారు సహకరించి, ఇలా పరస్పరం సహకరించుకోవాలనుకునేవారు. శ్రీ వినయేంద్ర అందర్నీ కూడా ఎంతో ప్రేమగా అత్యంత భక్తి శ్రద్ధలతో సేవించేవారు. (ఒక సాధు మహాత్మునికి ఒక ఆశ్రమాన్ని నిర్మించి, అందులో తాను కూడా దగ్గర దగ్గర పది సంవత్సరాలు గడిపారు) కానీ ఎవరి వద్దా దీక్ష తీసుకోలేదు (గురు-శిష్యుల బంధం ఏర్పరిచే దీక్ష) ఎవరినీ గురువుగా స్వీకరించనూలేదు. ఏ ఆధ్యాత్మిక మార్గాన్ని అనుసరించలేదు. “కానీ నా మనస్సు వేరే దేనికోసమో వెతుకుతూంది. చిత్రమేమిటంటే నా శోధన గురుదేవులు (శ్రీ పరమహంస యోగానంద) 1935-36లో భారతదేశంలో ఉన్నప్పుడే మొదలైంది,” అని వివరించారు శ్రీ వినయేంద్ర. “వారు 1936లో శ్రీయుక్తేశ్వర్ గిరిగారి మహాసమాధి విషాదం సమయంలో నేను కూడా పూరీలోనే ఉన్నాను. నేను చాలా సార్లు వారిని కలిసే అవకాశం తృటిలో కోల్పోయాననుకుంటా. వారిని అప్పుడే కలసి ఉంటే నా శోధన ఆరంభంలోనే ముగిసేది, కానీ అలా జరగలేదు.”

మహిషాదల్ అనే ప్రాంతంలో తన భార్య జ్ఞాపకార్థం ఒక సుందరమైన కళాశాలను శ్రీ వినయేంద్ర నారాయణ్ స్థాపించారు. చివరి 23 సంవత్సరాలలో తన నలుగురు మిత్రులతో కలిసి చాలా అవసరమైన ఒక క్షయరోగ నివారణ ఆరోగ్య కేంద్రమును నెలకొల్పాలని అనుకొన్నారు. వారు పశ్చిమ బంగాల్ లో ఆరోగ్యప్రదమైన మైదాన ప్రదేశం గిరిదంగ దగ్గర దానిని స్థాపించి, దానికి “నిరామోయ్” (స్వస్థత) అని పేరు పెట్టి వారి కలకు వాస్తవ రూపం ఇచ్చే ప్రయాణం మొదలపెట్టారు. వారు తమ మధ్య తగినంత ధనం పోగుచేసి, ఆ ధనంతో ఈ అద్భుతమైన పథకాన్ని వివరించే కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంచిపెట్టారు. స్వామి శ్యామానందగిరి జీవన లక్షణాలు అయిన “నమ్మకము, పట్టుదల, నిరంతర శ్రమలు” ప్రతిఫలాలనిచ్చాయి. ఆ ఆరోగ్య కేంద్రానికి దేశ నలుమూలల నుండి సహాయ సహకారాలు అందాయి; ఈనాడు ఈ ఆరోగ్య కేంద్రము శస్త్ర చికిత్స సౌకర్యాలతోను ఇంకా బయట ఒక ఛాతీ క్లినిక్ తో ఆదర్శప్రాయమైన వైద్యాలయముగా విరాజిల్లుతుంది. ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ ఈ హాస్పిటల్ జనరల్ కౌన్సిల్ కు అధ్యక్షురాలు. ఈ సంస్థకు రెండు ఛాతీ క్లినిక్ శాఖలు అలాగే ఇటీవల కలకత్తాలో పెద్ద 15 అంతస్తులు భవనంలో అనేక చికిత్స వసతులతో కూడిన ఒక హాస్పిటల్ ప్రారంభిoచబడింది—ఇవన్నీ కూడా శ్యామానందగారి సహాయముతో స్థాపించబడినవే! ఇది ఒక ధార్మిక వైద్య సంస్థ, స్థోమత ఉన్నవారి వద్ద నామమాత్రంగా లేదా వారు ఇవ్వగలిగినంత పద్ధతిలో చికిత్సలందిస్తుంది.

సత్యాన్వేషణ కోసం తీవ్రమైన కోరికతో, గౌతమ బుద్ధుడు బోధి వృక్షం క్రింద అంతిమ జ్ఞానోదయం పొందిన అతిపావనమైన బోధ్ గయ మరియు రాజ్ గిర్ పుణ్యక్షేత్రాలను 1946లో శ్యామానందగారు దర్శించారు. శ్యామానందగారు పగలంతా బోధి వృక్షం క్రింద ధ్యానము చేసేవారు. ఇంకా ఆ మందిర శిధిలాలలో, రాజ్ గిర్ దగ్గరలోని బౌద్ధ ఆరామాలలోనూ సంచారం చేశారు. సాయంత్రం వేళ రాజ్ గిర్ లోని ప్రభుత్వ విశ్రాంత గృహంలో విరామం తీసుకున్నారు. ఆ రోజు రాత్రి 2-3 గంటల సమయాన ఉన్నట్లుండి మెలకువ వచ్చింది. ఒక్క ఉదుటున మంచం మీద నుండి లేచి ఆ గదిలో సుందరమైన నీలి రంగు కాంతిని చూశారు. తన దివ్యానుభవాన్ని ఈ విధంగా వివరించారు:

“నీలి రంగుగల ఆ కాంతి గదిలోని ఒక మూల నుండి ప్రసరించింది. అప్పుడు ఆ కాంతి గది మొత్తము ఆవరించింది. ఆ మూలనున్న నీలి కాంతి గుండ్రముగా తిరగడము ప్రారంభించింది. ఆ కాంతిలో ఒక ముఖము కనిపించింది, ఆ తరువాత ఛాతీ వరకు, చివరకు మొత్తం మూర్తి కనిపించింది. ఆ ముఖము ఎంతో ప్రసన్నముగా ఉంది, ఎంతో పూజ్యమైనది—ఓహ్ ఎంతో పూజ్యమైనది! ఈయన ఎవరై ఉంటారని ఆలోచింపసాగాను. బుద్ధుడా లేదా పరమశివుడా? అని. ఆ మహానుభావునికి గౌతమ బుద్ధుని కుండే పొడవైన చెవికన్నాలు లేవు, చిన్న చిన్న ఉంగరాల జుట్టు లేదు, పరమేశ్వరునికున్న జఠాజూటాలుగానీ, మెడలో పాముల హారం [2] కానీ లేవు. ఆయన ముఖము మాత్రము వారివలె ప్రసన్నంగానూ అందంగాను ఉంది, జుట్టు తిన్నగా వెనుకకు వేసి వుంది. ఆయన నాతో మాట్లాడారు, నాకు ఒక మంత్రాన్ని [3] ఉపదేశించారు. అది నాకు చాలా అద్భుతమైన అనుభవం. ఆ తరువాత 12 సంవత్సరాలు ఆ ముఖం కోసం వెదుకుతూనేవున్నాను.

1969 హాలీవుడ్ టెంపుల్ ఇండియా హాల్ లో విందు

“1958లో కలకత్తా సమీపంలో ఒక ప్రశాంత ఆశ్రమంలో అన్ని బాధ్యతల నుండి వైదొలగి ధ్యానం చేసుకోవాలని నిర్ణయించుకొన్నాను. దక్షిణేశ్వర్ లో కాళీమాత ఆలయానికి సమీపంలో యోగదా మఠము ఒకటి ఉందని నేను విన్నాను. అక్కడకు వెళ్ళాను, అది నిజంగానే ఏకాంతంగా ఉంది. సందర్శకులు కూడా ఎక్కువమంది రావడం లేదు. ఆ మఠము గంగా నది ఒడ్డున నిర్మించబడి అతి రమ్యముగా ఉంది. అక్కడ ఉన్న ఒక సన్యాసిని బస గురించి అడిగాను. అతడు ఆ మఠము యొక్క వ్యవస్థాపకుడి గురించి చెప్పి ఒక యోగి ఆత్మకథ (ఆటోబయోగ్రఫీ ఆఫ్ ఏ యోగి) అనే పుస్తకాన్ని చూపించాడు. నేను ఆ పుస్తకాన్ని కొనుక్కొని వచ్చేశాను.

“అనేక సంవత్సరాలు పాశ్చ్యాత్య దేశాలలో గడిపినవాడు, తన చరిత్రను తానే వ్రాసుకున్నవాడు అయిన ఆ యోగిపై నాకు విశ్వాసము కలుగలేదు. అయితే ఆ గ్రంథాన్ని అక్కడక్కడ కొన్ని పేజీలు చదివాను. అది సాధారణ పుస్తకం కాదని, నేను చూసిన ప్రతి పేజీ ఆధ్యాత్మిక సత్యాలు, జీవముతో నిండి ఉన్నాయని గ్రహించాను.

“కానీ ఊహించుకోండి, ఆ గ్రంథములో మహావతార్ బాబాజీ ఫొటో ఉన్న పేజీని చూచి నా విస్మయం. ‘ఈయనే!’ నేను ఆశ్చర్యపోయాను, ‘ఎవరైతే నాకు దర్శనమిచ్చారో, ఎవరికోసం సంవత్సరాలు తరబడి వెదుకుతున్నానో! నిజమేనా? లేక నేను ఊహించుకుంటున్నానా?'”

అమెరికాలో శ్రీ పరమహంస యోగానందగారు స్థాపించిన ఎస్.ఆర్.ఎఫ్. మఠానికి ఒక అమెరికన్ మహిళ అధ్యక్షురాలుగా ఉన్నారని, ఆమె కలకత్తాలోని దక్షిణేశ్వర్ లో ఉన్న యోగదా (వై.ఎస్.ఎస్.) మఠమును సందర్శించుటకు వస్తున్నారని అక్కడి సన్యాసి చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. “ఒక అమెరికన్ మహిళ ఆధ్యాత్మిక అధ్యక్షురాలిగా ఉండడం నాకు అసంబద్ధంగా తోచింది. అందులోనూ ఒక మహిళ? చాలా హాస్యాస్పదం!” అలా సాగాయి ఆయన ఆలోచనలు. “అయినప్పటికి ఆమెను చూడాలని నాకెందుకో అనిపించింది. అనిపించిన కొద్ది రోజుల్లోనే శ్రీ దయామాతో మాట్లాడాను. ఆ సమావేశం నుండి బయటకు వచ్చాక ఇన్నాళ్ళూ నా సాధనలో ఉన్న లోటు, ప్రతిగా దానికి కావలసిన అంశాన్ని ఆమె నాకు అందచేశారని నాకు తెలిసింది. అప్పట్లో నేను ప్రఖ్యాత స్వామి వివేకానందగార్ని ప్రేరణగా తీసుకొని జ్ఞాన మార్గాన్ని ఆచరిస్తూ ఉండేవాడిని. అయితే నా సాధన పొడిగా, వ్యర్థంగాను సాగుతూ ఉండేది. అయితే శ్రీ దయామాతగారు నాకు భగవంతునిపై ప్రేమను, భక్తిని, కోరికనూ పెంచుకోమన్నారు. నా హృదయం వాటితో నిండడం మొదలుపెట్టింది. ఆమె చెప్పినది సరియైనదే అని నాకు తెలిసింది. సరిగ్గా రాజ్ గిర్ లో బాబాజీని దర్శించిన 12 సంవత్సరాల తరువాత అదే రోజున శ్రీ దయామాతతో నా మొదటి సమావేశం జరగడం విచిత్రమనిపించింది; ఇంక నా అన్వేషణ ముగిసిందని నాకు అనిపించింది.

“అయినప్పటికీ ఇంకా ఎన్నో సందేహాలు నాలో మెదులుతూనే ఉండేవి. ఇప్పుడు ఈ మాయలో తప్పు దారిన పడితే మొత్తం జీవితం, ఈ అన్వేషణ, అన్నీ కూడ వ్యర్థమైపోతాయి.” అందుకని ఆయన కాస్త దూరాన్ని పాటించేవారు, చాలాసార్లు దక్షిణేశ్వర ఆశ్రమానికి పోయి ధ్యానము చేసి నిశ్శబ్దంగా వెళ్ళిపోయేవారు. కొన్ని సార్లు అయితే చాలా దీర్ఘ కాలం ఆశ్రమానికి దూరంగా వుండేవారు. కానీ తిరిగి ఆశ్రమానికి వెళ్ళిన ప్రతిసారి, ఏదో తెలియని ప్రశాంతత ఆయనను ఆవహించేది. శ్రీ దయామాత తనని కలసిన అందరిలోనూ ఆయనను, భారతదేశంలో భగవంతుని దర్శనం కోసం ఆర్తిగా పరితపించే ఒక ప్రత్యేకమైన దివ్యాత్మగా గుర్తించారు.

శ్రీ పరమహంస యోగానందగారు మొదలుపెట్టి, పురోగతి చెందుతున్న యోగదా బాలుర పాఠశాలను సందర్శించుటకు శ్రీ దయామాత రాంచీకి వెళ్ళినప్పుడు, ఆయనకూడ రాంచీకి వెళ్ళేవారు. రాంచీలో చేయవలసిన కార్యాలను గూర్చి వారిరువురు చాలాసార్లు సుదీర్ఘంగా మనసువిప్పి చర్చించుకున్నారు. శ్రీ శ్రీ దయామాత తన మనస్సులోని బాధను ఆయనతో పంచుకున్నారు; గురుదేవులు భారతదేశంలో మొదలుపెట్టిన సంస్థ ఎంతగా నిర్లక్ష్యానికి గురైందో, ఎంత శిధిలావస్థకు చేరుకుందో—ఈ సంస్థ ఇంచుమించు పతనావస్థలో ఉంది. శ్రీ వినయేంద్రగారు కూడా దీనికి చక్కగా స్పందించినట్లు శ్రీ దయామాత గమనించారు.

ఆయన శ్రీ దయామాత బృందంతో బాటు పూరిలోని శ్రీయుక్తేశ్వర్ గారి యోగదా సత్సంగ ఆశ్రమం దర్శిచుటకు వెళ్ళారు. ఆ యాత్రలో శ్యామానందగారి మనస్సులో మిగిలిన కొద్దిపాటి సందేహాలన్నీ శాశ్వతంగా తొలగిపోయాయి.

భారతదేశంలోనున్న అతి పవిత్ర దేవాలయాలలో పూరీలోని జగన్నాథ ఆలయము ఒకటి. ఈ ఆలయం అంటే శ్రీ శ్యామానంద మనస్సులో ఒక ప్రత్యేక పూజ్యభావం. పూరీలోనున్న జగన్నాథుని దర్శించడానికి అనేక సార్లు పూరీకి వచ్చి, దర్శనము చేసుకొని, ఆ పవిత్రమైన ప్రదేశాలలో ధ్యానము చేసినప్పుడుల్లా మంచి ఆధ్యాత్మిక అనుభవాలు కలిగేవి. పూరీలోనున్న పరమ పూజ్యులు శ్రీ శ్రీ శంకరాచార్య భారతీకృష్ణ తీర్థ [4] స్వాముల వారి ప్రత్యేక అనుమతితో శ్రీ దయామాతకు జగన్నాథ ఆలయములోనికి ప్రవేశము లభించింది. జగన్నాథ ఆలయము [5] లోనికి ప్రవేశము పొందిన మొట్టమొదటి అమెరికన్ మహిళ శ్రీ దయామాత. శ్రీ శ్యామానంద కూడా ఆ ప్రత్యేక బృందంతో ఉన్నారు.

జగన్నాథుని రూపంలో ఉన్న లోకపాలకుడు శ్రీ కృష్ణుడు ; అన్న బలరాముడు, మరియు చెల్లెలు సుభద్ర, మూర్తుల రూపంలో కొలువై ఉన్న పూజావేదిక ముందు శ్రీ దయామాత ధ్యానం చేస్తున్నారు. అలా కూర్చున్న కాసేపటికే ఆవిడ గాఢమైన సమాధి స్థితిలోకి వెళ్ళి తన చుట్టూ ఉన్న పరిసరాలను మరిచిపోయారు. అప్పుడు తాను పొందిన అనుభవాన్ని గూర్చి శ్రీ శ్యామానందులు ఇలా వివరించారు:

“నేను ఒక గోడకు ఆనుకొని నిలబడి ధ్యానంలో కూర్చొని ఉన్న మాతాజీని గమనించసాగాను. ఉన్నట్లుండి శ్రీ దయామా శరీరం అదృశ్యమయ్యి కాంతిగా మారింది. నేను జగన్నాథ మూర్తిని, ఆ తరువాత శ్రీ దయామాను మరల జగన్నాథమూర్తిని ఇలా మార్చి మార్చి చూడసాగాను. ఇది నా ఊహ కాదు కదా అని మళ్ళీ నిర్ధారించుకున్నాను. అప్పుడు వారిద్దరు ఒక్కటేనని అర్థమైంది. ఈ అనుభవం చాలాసేపు సాగింది. ఆ తరువాత నెమ్మదిగా శ్రీ దయామా మామూలు రూపము కనిపించింది. కొంతసేపు తరువాత దయామా లేచి ఆలయము బయటకు వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు శ్రీ దయామా తన కాషాయ రంగు జేబు రుమాలును అక్కడ జారవిడిచారు. దయామాతో ఉన్నవారు ఎందుకు ఆ జేబురుమాలును తీసుకువెళ్ళలేదానని నేను ఆశ్చర్యంలో మునిగిపోయాను. ఆ జేబురుమాలను తీయడం నాకు సుతారామూ ఇష్టం లేదు. ఆ పవిత్ర దేవాలయములో నేను పొందిన దివ్యానుభవానికి ఆ జేబురుమాలు ఒక చిహ్నం అనిపించింది. ఆ జేబు రుమాలును తీసుకోవడమంటే ‘ఆ జగన్నాథుని సన్నిధిలో గురుదేవుల కార్యాచరణ బాధ్యతలను భుజాన వేసుకోవడమే’ అనుకున్నాను. అంతవరకు ఎవరితోనూ, లేదా ఏ సంస్థతో గాని నేను కట్టుబడి లేను. అయితే ఆ జేబురుమాలును అక్కడే వదిలివేసి వెళ్ళడానికి నా మనస్సు అంగీకరించలేదు. భావోద్వేగంతో గుడిలోని జగన్నాథుని చూచి, ‘ప్రభూ! ఏమి నీ లీల? ఏమి నీ ఆన?’ అని ప్రార్థించాను. ‘ఎట్టకేలకు ఏమి జరగాలో అది జరుగుతుంది’ అని అనుకొని జేబు రుమాలును తీసుకొని బయటనున్న శ్రీ దయామాకు ఇచ్చాను.”

డిసెంబర్ 1963, హిమాలయాలలోని ద్వారహాట్ మార్గములో శ్రీ దయామాత, స్వామి శ్యామానంద, అక్కడి పర్వత నివాసులతో ముచ్చటిస్తున్న దృశ్యం.
శ్రీ దయామాత, స్వామి శ్యామానంద, మరియు శ్యామానందగారి ఆజన్మ స్నేహితుడయిన వై.ఎస్.ఎస్. మాజీ ఉపాధ్యక్షుడు శ్రీ వనమాలి దాస్.

తన జేబురుమాలు గుడిలో జారి పోవడాన్ని, శ్రీ శ్యామానంద దానిని తీసుకొనుటకు సుముఖముగా లేరనే విషయము శ్రీ దయామాతకు కొంచెం తెలిసే ఉంటుంది. ఆ జేబురుమాలు ఒక సంకేతం అని కూడా ఆమెకు తెలుసు. శ్రీ శ్యామానంద దానిని తిరిగి తనకు తెచ్చి ఇవ్వడమంటే ఆమెకు ముందుగా తెలిసినదాన్ని నిర్ధారణ చేసినట్లయింది. భారతదేశంలో తన గురుదేవుల కార్యాచరాణాన్ని తిరిగి పునరిద్ధరించటానికి ఆ భగవంతుడే ఆయనను ఎన్నుకొన్నాడని.

గురుదేవుల కార్యాచరణ బాధ్యతను తీసుకొనే చాలా సంవత్సరాలకు పూర్వమే శ్యామానందగారి జీవితంలో ఇంకొకటి కూడా జరిగింది. 1930లో దుర్గాపూజ [6] సందర్భంగా శ్యామానందగారి ఆజన్మ మిత్రులలో ఒకరయిన శ్రీ వనమాలి దాస్ [7] వారి కుటుంబముతో సహా ఉండుటకు రాంచీలోని పెద్ద భవనాన్ని ఒక నెల వరకు అద్దెకు తీసుకున్నారు. యువకులు శ్రీ శ్యామానంద ఆయన ప్రియ మిత్రులు సెలవు రోజులకు శ్రీ వనమాలి దాస్ అతిధులుగా ఆ భవనంలో గడపడం జరిగింది. వీరందరికి తెలియని విషయం వారుంటున్న ఆ బంగళా మహారాజ కాశింబజార్ ఆస్థానంలోని ఒక భాగం, ఒకప్పుడు శ్రీ పరమహంస యోగానంద యోగదా పాఠశాల ఈ బంగ్లాలో నడిపారు. కానీ తరువాత విద్యార్థుల సంఖ్య పెరిగి ఆ బంగ్లా పిల్లలకు సరిపోనందున 1929లో దానిని ఖాళీ చేశారు. శ్యామానందగారు తన మిత్రులతో ఆ భవనం చేరినప్పుడు “యోగదా” అని వ్రాయబడిన ఒక చెక్క పలక నేలపై పడి ఉండడాన్ని శ్రీ శ్యామానంద గమనించారు. “ఆ పలకను చెదలు తింటున్నాయి, అది దుమ్ముపట్టి ఉంది. నాకు సంబంధం లేనిది అయినాసరే ఏదైనా వస్తువు పాడైపోతూ ఉంటే నేను స్పందించకుండా ఉండలేను. అది నా స్వభావము. ఇచట పూర్వము ఒక ఆధ్యాత్మిక సంస్థ ఉండి ఉండవచ్చు. కావున ఆ సంస్థకు చెందిన చెక్క పలక నేలపై పడి ఉంటే, దానిపై నడవడమూ జరుగవచ్చు. ఇది మంచిది కాదు అనుకున్నాను. వెంటనే ఆ పలకను తీసుకొని, దాని మీదనున్న దుమ్మును దులిపివేసి, ఒక చెట్టు మొదట్లో ఉంచాను.” ఈ విధంగా తనకు తెలియకుండానే శ్రద్ధగా మొదటి గురు సేవ చేశారు.

పూరీలో శ్రీ దయామాతతో ఉన్నప్పుడు శ్యామానందగారు తనకు క్రియాయోగ దీక్ష [8] ఇవ్వమని శ్రీ దయామాతను కోరారు. ఈ దీక్షా వేడుక స్వామి శ్రీయుక్తేశ్వర్ సమాధిపై శ్రీ పరమహంసగారు నిర్మించిన స్మారక మందిరంలో జరిగింది. ఈ మందిరం ఆశ్రమ మైదానంలో ఉంది. భారతదేశంలో శ్రీ దయామాత వద్ద క్రియాయోగ దీక్ష తీసుకున్న మొట్టమొదటి వ్యక్తి శ్రీ శ్యామానంద. అది మొదలు: శ్రీ పరమహంస యోగానందగారి కార్యాచరణం తిరిగి జీవం పోసుకుంది.

1958-59లో భారతదేశానికి వీడ్కోలు చెప్పి, అమెరికాకు ప్రయాణమయ్యేటప్పుడు అప్పటి శ్రీ వినయేంద్ర నారాయణ్ దుబే (శ్రీ శ్యామానంద) యోగదా సత్సంగ సొసైటీలో పాలక మండలి (బోర్డు ఆఫ్ డైరక్టర్స్) సభ్యుడుగానూ ఆ తరువాత జనరల్ సెక్రెటరిగానూ ఎన్నుకోబడ్డారు. ఆ తరువాత సెల్ఫ్-రియలైజేషన్ ఫెలోషిప్, అంతర్జాతీయ ప్రధాన కార్యాలయంలో కూడా పాలక మండలి (బోర్డు ఆఫ్ డైరక్టర్స్) సభ్యుడుగా అయ్యారు. శ్రీ దయామాత, అనేక పర్యాయాలు శ్రీ శ్యామానందను సన్యాస దీక్ష తీసుకోమని ప్రోత్సహిస్తూ వచ్చారు. 1938 కుంభమేళాలో సన్యాస దీక్షకు సంబంధించిన ప్రతిజ్ఞను శ్యామానందగారు తీసుకున్నారు. అయితే శ్రీ శ్యామానంద పదే పదే వద్దు అని తిరస్కరిస్తూ ఆయన తన అభిప్రాయం ఇలా వ్యక్తీకరించారు: “ఈ నామాలతో (బిరుదులు) ఎంత సులువుగా పాడవుతామో! ముఖ్యంగా భారతదేశంలో సర్వసంగపరిత్యాగ చిహ్నమయిన కాషాయ రంగు దుస్తులు వేసుకున్న స్వాములకు ఎంతో మిక్కిలి గౌరవము ఉంటుంది. కాబట్టి మొదట సన్యాస దీక్ష తీసుకునుటకు నాకు అర్హత ఉందో లేదో తెలుసుకోవాలి. ఆ తరువాత ఆ భగవంతుని నిర్ణయము ప్రకారమే జరుగుతుంది.” కొంత కాలం తరువాత శ్రీ దయామాతచే “యోగాచార్య” బిరుదును వినయపూర్వకముగా స్వీకరించారు. శ్రీ దయామాత 1970 అక్టోబరు 10వ తేదీన శ్రీ వినయేంద్రకు సన్యాస దీక్షను, సనాతన గిరి శాఖ పద్ధతిలో ఇచ్చి, “స్వామి శ్యామానంద గిరి” అను నామాన్ని ఇచ్చారు. శ్రీ పరమహంస యోగానందగారు, వారి సన్యాస శిష్యులందరు ఈ గిరి శాఖకు చెందినవారే!

శ్రీ దయామాత, శ్రీ మృణాళినీమాత, శ్రీ శ్యామానంద – 1968లో రాంచీలోని యోగదా స్కూల్ ఉపాధ్యాయులతో కలిసివున్న చిత్రం.

శ్రీ శ్యామానంద దాదాపు 12 సంవత్సరాలు (1959-1971) నిస్వార్థంగా, అలుపెరుగని అంకిత భావముతో గురుదేవుల సంస్థ అభివృద్ధి కోసం తన సేవలను అందించారు. వీరి అకుంఠిత కృషి వల్లనే కూలిపోతున్న యోగదా సత్సంగ సొసైటీ, శ్రీ పరమహంస యోగానందగారు కన్న ఉదాత్త కలలుకు, శ్రీ దయామాత గురుదేవులుకు ఇచ్చిన హామీని ప్రతిఫలిస్తూ వైభవోపేతంగా రూపుదిద్దుకున్నది. శ్రీ శ్యామానంద అకుంఠిత కృషి వలన శిధిలావస్థలోనున్న సంస్థ పునరుజ్జీవన వైభవాన్ని మళ్ళీ పొందింది. భగవత్ ప్రేరేపణతో అత్యంత అరుదైన వ్యక్తిత్వ లక్షణాలు కలిగిన ఈయన సహాయం ద్వారా శ్రీ దయామాత తలపెట్టిన ఈ చిరస్మరణీయమైన కార్యం సాధ్యం అయ్యింది. శ్రీ దయామాత మార్గదర్శకత్వంతోనూ, ఆశీస్సులతోనూ ఇంకా ఆమె తదుపరి మూడు పర్యాయాల భారతదేశ పర్యటనల ప్రేరణతో ఈ బృహత్తర కార్యం గొప్ప ఊపందుకొంది. శ్రీ శ్యామానంద కృషితో రాంచీ పాఠశాలలోనూ, ఆశ్రమాల్లోనూ కొడుగడుతున్న జీవాన్ని తిరిగి పునరుద్ధరించారు. రాంచీలోనూ, ఇతర ప్రాంతాలలోనూ కొన్ని క్రొత్త స్కూళ్లను కూడా ప్రారంభించారు. భారతదేశమంతా పర్యటించి యోగదా సత్సంగ కేంద్రాలను, ధ్యాన మండలులను స్థాపించి, గురుదేవుల ఆశయాలను ప్రచారము చేశారు. శ్రీ పరమహంస యోగానందగారి బోధనలను ప్రపంచవ్యాప్తంగా విస్తృతం చేయడానికి 1968-71 మధ్యలో లాస్ ఏంజిలిస్ లోని వై.ఎస్.ఎస్./ఎస్.ఆర్.ఎఫ్. అంతర్జాతీయ కేంద్రానికి నాలుగుసార్లు వెళ్ళారు. ఈ ప్రయాణములో వారు ప్రపంచములోని అనేకమంది వ్యక్తులను, ఎస్.ఆర్.ఎఫ్. కేంద్రాలను సందర్శించి శ్రీ పరమహంస యోగానందగారి బోధనలు ప్రాచుర్యం చేయడంలో సహాయపడ్డారు.

శారీరక విశ్రాంతి కావాలని ఆయన ఎన్నడూ కోరుకోలేదు. ఆయనకు ఎంత అంకితభావము, ఉత్సాహము ఉన్నాయి అంటే, ఆయనకు తన బాధ్యతల నుండి విశ్రాంతి అవసరమని కూడా స్ఫురించేది కాదు. ఆయన తరచు ఇలా అనేవారు, “భగవంతుణ్ణి, గురువును సేవించుటలో కలిగే శారీరక, మానసిక ఉత్తేజం ఇంక ఏ పనిలోనైనా కలుగుతుందా? నేను భగవంతుణ్ణి గురించి మాట్లాడేటప్పుడు, భగవంతుడి కోసం పని చేసేటప్పుడు, ఆయన జీవశక్తి నన్ను నింపేస్తుంది.” ఇన్ని సంవత్సరాల కార్యాభివృద్ధిలో, ఎదురుదెబ్బలు, విమర్శలు, ఇంకా లెక్కలేనన్ని అడ్డంకులు లేకపోలేదు. శ్యామానందగారికి భగవంతుడు కార్యసాధనకు కావలసిన శక్తిని, వివేకాన్ని పుష్కలంగా ఇచ్చాడు, ఇంతటి బృహత్తర కార్యం తక్కువ ఆధ్యాత్మిక వ్యక్తిత్వం, గ్రహణశీలత కలిగిన వాళ్ళతో ఎప్పటికీ నెరవేరేది కాదు.

“నేను అరవై ఏళ్ళకు మించి బ్రతకను. నేను, నాతో పనిచేసే వారందరము అనేక సంవత్సరాలు చేయవలసిన పనులను కొన్ని సంవత్సరాలలోనే పూర్తి చేయాలి. గురుదేవుల కొరకు ఇప్పుడు పని చేయకపోతే నేను భవిష్యత్తులో చేయలేను. భగవంతుడు ఆ తరువాత ఇలాంటి అవకాశము ఇవ్వడేమో?” అని తరచుగా అంటుండేవారు శ్రీ శ్యామానందగారు.

శ్రీ దయామాత, స్వామి శ్యామానంద, 1968లో దక్షిణ భారతదేశ పర్యటన, చెన్నై.

శ్యామానందగారి సేవాతత్వాన్ని క్లుప్తంగా ఆయన మాటలలోనే ఇలా చెప్పవచ్చు. “భగవంతుని కొరకు పని చేయడమే నిజమైన పూజ. నేను పని చేస్తూనే ఉంటాను; అదే నా నిర్ణయం. కర్తవ్య నిర్వహణలోనే నాకు ముక్తి, మోక్షం ఉంటుంది. వేరే విధముగా పూజించడంలో నా మనస్సు పరిపరివిధాలుగా పోవచ్చు, భగవంతుని పైనా గురువు పైనా లగ్నం కాకపోవచ్చు. కానీ పనిలో నా శరీరంలో కొంత భాగమైనా ‘వారితో’ అనుసంధానమై వుంటుంది. కొన్ని క్షణాలయినా మనస్సు భగవంతునిపై లగ్నమౌతుంది. వారి కార్యంలో నా మనస్సు, కాళ్ళు, చేతులు లగ్నమైనపుడు, అప్పుడప్పుడు నా మనస్సు పరధ్యానంలో ఉన్నా కానీ నా కాళ్ళు చేతులు మాత్రము భగవంతుని కొరకు పని చేస్తూనే ఉంటాయి. ఇంతకుముందు, నేను ఎక్కువ సేపు ధ్యానము కోసం కేటాయించాలని అనుకునేవాడిని. అయితే ధ్యానం చేసేటప్పుడు నా మనస్సు భగవంతుడి నుండి పరిపరివిధాల పోయినపుడు, ఆ క్షణాల్లో నేను వంద శాతం భగవంతుడికి దూరమౌతాను. అయితే భగవంతుడి కొరకు గురువుగారి కొరకు, పనిచేస్తున్నప్పుడు, పరిగెడుతున్న నా మనస్సు కొంతశాతమైనా భగవంతుడిపై లగ్నమౌతుంది. ఇదే కర్మయోగ రహస్యమని నాకు తెలిసింది. నా రక్తం ఆఖరి బొట్టు వరకూ గురువుదేవుల సేవ చేస్తుంటాను. ఈ గురు సేవలోనే నాకు మోక్షముందని నా నమ్మకం.”

1970లో శ్రీ దయామాత శ్రీ శ్యామానందకి కాషాయ వస్త్రాన్ని కప్పుట.

ఏ కొద్దిమందికి మాత్రమే సాధ్యమయ్యేరీతిలో ఆయన తన ప్రతిజ్ఞను జీవితాంతము నిలబెట్టుకున్నారు. ఆయన చివరి దశలో భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు, ఆయన శక్తి సన్నగిల్లినప్పుడు కూడా ఆయన గురుసేవను మానలేదు. ఉత్తరాలు వ్రాయిస్తూ, వాటిపై సంతకాలు పెడుతూ ఉండేవారు, ఇండియాలో జరుగవలసిన పనులకు సూచనలు, సలహాలు ఇస్తుండేవారు. ఆయనకు వైద్యమందించేవారికి ఇది చాలా అబ్బురపరిచేది. అంత్యకాలములో ఏ మాత్రము శక్తి లేనప్పుడు కూడా తోటి ఆశ్రమ వాసులను చూడాలని, వారీతో మాట్లాడాలని, ఆయన పాటుపడిన విధంగా మిగిలిన వారిని ప్రేరేపించి, వారిని గురుసేవకు, వారి ఆశయాలకు, కార్యోన్ముఖులను చేయాలని ఆశించేవారు. ఆయన ఇలా ప్రార్థించేవారు, “హే! పరమాత్మా! నేను ఇప్పుడే ఈ శరీరాన్ని వదిలివేయడమనేది నీ కోరిక అయితే నాలో రగులుతున్న ఈ కోరిక తీర్చు. నేను మరలా ఈ భూమి మీద త్వరగా పుట్టి తిరిగి గురుసేవలో తరించాలి!”

అనారోగ్యము అనేది ఆయన అంతరంగాన్ని తాకలేదనే చెప్పాలి. ఆయన ఎప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా, భక్తి, దివ్య ప్రేమలతో ఉండేవారు. అన్నిటికీ మించి ఆయన జీవితాంతం అత్యంత ప్రేమించి, ఆరాధించిన జగన్మాత రూపంలో ఉన్న భగవంతుని సంకల్పానికి తన జీవితాన్ని అర్పించుకున్నారు. ఆ రోజులలో ఆయనకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాలు–జగన్మాత, గురుదేవులతో ఆనంద అనుసంధానానుభవాలు; అలాగే కనీసం రెండు సందర్భాలలో బాబాజీ దర్శనభాగ్యం కలిగింది. తుది శ్వాస వరకు ఆయన మంచి, మెరుగైన స్పృహలోనే ఉన్నారు. ఆ భగవంతుని పిలుపుతో తుది శ్వాస విడిచే నాలుగు గంటల ముందు, ఆయన చెవిలో గురు, భగవాన్నామ సంకీర్తన వింటూ, తనకున్న శక్తినంతటినీ కూడగట్టుకొని, భగవంతునికి గురువదేవులకు ప్రణామము [9] చేశారు.

తన మరణానికి కొన్ని వారాల ముందు శ్రీ శ్యామానంద శ్రీ దయామాతతో ఇలా చెప్పారు, “నా చిన్నతనం నుండి నా స్థిర నివాసముండే ప్రదేశం ఒక దృశ్యంలా మనస్సులో మెదిలేది. ఎప్పుడో ఒకప్పుడు నేను దానిని కనుగొంటానని ఎప్పుడూ అనుకుంటూవుండేవాడిని. అది హిమాలయాలలోని బద్రీనాథ్ దగ్గర గాని, వాటికింకా తరువాత ఉన్న ఒక కోన కావచ్చు. [10] అది తప్పకుండా కనుగొనాలనే కోరిక

ఉండేది. ఆ ప్రదేశంలో ఒక నివాసమేర్పరచుకొని ఒంటరిగా భగవంతుణ్ణి గూర్చి ధ్యానము చేస్తూ, నా చివరి రోజులు అక్కడ గడపాలని అనుకుంటూ ఉండేవాడిని. అయితే అలాంటి ప్రదేశాన్ని ఇంతవరకు నేను చూడలేకపోయాను. అది ఆ ప్రాంతంలోనే తప్పక ఉండి ఉంటుంది.”

అయితే శ్యామానందగారు ఊహించిన ప్రదేశం ఈ సాధారణ ప్రపంచంలో ఉండకపోవచ్చునేమో! బహుశా ఆయన తన మరణానంతరం ఆ ప్రదేశాన్ని ఇపుడు కనుగొని ఉండవచ్చు, తన ప్రియ పరమాత్ముని సన్నిధిలో, అన్ని బాధ్యతలనుండి ముక్తి నొంది ధ్యాన విశ్రాంతి పొందుతూ సురక్షితమైయుండవచ్చు. ఆయన తిరిగి నూతనోత్తేజంతో, చైతన్యవంతమై పునఃసంకల్పంతో ఆ పరమాత్ముడి అనుమతితో గురుదేవుల సేవకై తిరిగి భూమిపైకి ఒక క్రొత్త, శక్తివంతమైన వ్యక్తిగా అవతరిస్తారు!

స్వామీజీ సన్యాస ప్రమాణం ముగింపులో శ్రీ దయామాత మరియు స్వామి శ్యామానంద మౌన ప్రార్థనలో నిలబడి ఉన్నారు.

శ్రీ శ్యామానంద భౌతిక దేహాన్ని వీడే కొన్ని వారాల ముందు ఒక సాయంత్రం వేళ బెంగాలీ భాషలో క్రింది పద్యాన్ని వ్రాశారు. తరువాత దానిని ఆంగ్లంలోకి అనువాదం చేశారు. (దీనికి తెలుగు అనువాదం)

“జీవిత ఉదయ సంధ్య వేళ
మండే రథం మీద జీవాత్మ సవారి చేస్తుంది.
జీవిత సంధ్య వేళ,
అది దేనిని దర్శిస్తుంది?
ధూళి దూసితమైన నింగినా?
లేదా సాదరంగా ఆహ్వానించే దేదీప్యమయిన దిగ్మండలాన్నా!”

స్వామి శ్యామానందగారితో పరిచయమున్నవారు లేదా వారి సన్నిహితులు వారి అజేయమైన ఆత్మ తనను సాదరముగా ఆహ్వానించుచున్న ధగ ధగ మెరిసే దిగ్మండలాన్ని దర్శిస్తుందని నిస్సందేహంగా భావిస్తారు.

[1] శ్రీ రాంగోపాల్ ముజుందార్: ఒక యోగి ఆత్మ కథలో 13వ అధ్యాయము – “నిద్రపోని సాధువు”లో శ్రీ రాంగోపాల్ ముజుందార్ గురించి పూర్తి వివరణ ఉంది. శ్రీ పరమహంస యోగానందగారు భగవదాన్వేషణకు తన చివరి హిమాలయ పర్యటన ప్రయత్నంలో శ్రీ రాంగోపాల్ ముజుందార్ ను కలిసినప్పుడు ఆయన శ్రీ యోగానందగారిని ఆశీర్వదించి, బాబాజీని తాను మొదట ఎలా కలిసింది విపులంగా వివరించారు.

[2] ఆత్మనియంత్రణకు చిహ్నం, ప్రాణశక్తిపై పరిపూర్ణ నియంత్రణ. పరమ శివునికున్న అనేక నామాలలో ఒకటి “యోగి రాజ్.”

[3] శక్తివంతమైన ప్రకంపిత ఉచ్చరణ – సంస్కృతములో మంత్రము అంటే “ఆలోచన యొక్క సాధనము.”

[4] గోవర్ధన మఠానికి పీఠాధిపతి. 9వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యులు పూరిలో స్థాపించిన మఠం. ఆది శంకరాచార్యులు భారతదేశ సర్వోత్కృష్ట వేదాంతి. సన్యాస వ్యవస్థను పునర్వ్యవస్థీకరించినవారు జగద్గురువులు ఆది శంకరాచార్యులు.

[5] పూరి జగన్నాథ ఆలయము: ఈ ఆలయము అనేక శతాబ్దాలకు పూర్వము నిర్మించబడింది. ఈ పవిత్ర హిందూ ఆలయములోనికి హిందువులు కానివారికి పడమటి దేశవాస్తవ్యులకు ప్రవేశము లేదు. శ్రీ దయామాత ఈ ఆలయాన్ని దర్శించినప్పుడు, వారికి ప్రత్యేక అనుమతితో ఆలయంలోనికి ప్రవేశము లభించింది. అయితే మరల హిందువులు కానివారికి ఆలయ ప్రవేశము నిలిపివేయబడింది.

[6] దుర్గా పూజ: భగవంతుడికి జగన్మాత రూపములో ఉత్సవం జరుపుట.

[7] వనమాలి దాస్: శ్రీ వనమాలి దాస్ గారు యోగదా సత్సంగ సొసైటీ, ఇండియా సభ్యుడు. ఆ పై వై.ఎస్.ఎస్. పాలక మండలిలో సభ్యుడుగా పని చేశారు. శ్రీ శ్యామానందగారి మరణానంతరము వై.ఎస్.ఎస్.కు స్వామి శాంతానందగిరిగారితో పాటు జాయింట్ జనరల్ సెక్రెటరీగా సేవ చేశారు. ఆ తరువాత 1975-1984 వరకు ఉపాధ్యక్షుడుగా సేవ చేశారు.

[8] ఆధ్యాత్మిక దీక్ష; సంస్కృత క్రియా మూలంలో “దీక్ష” అనగా తనకు తానుగా అంకితమగుట.

[9] ప్రణామము: సంస్కృత అర్థం నమ = నమస్కరించడం, లేదా తలవంచి నమస్కరించడం; నమకు ముందు ప్ర అర్థం పూర్తిగా. అరచేతులు గుండె వద్దకు జోడించి నమస్కరించడం.

[10] బద్రీనాథ్ యాత్రికుల నడకదారి ప్రస్తావనలో; భారతదేశంలోని గొప్ప పుణ్యక్షేత్రాలలో బద్రీనాథ్ ఆలయము ఒకటి. ఇది హిమాలయ పర్వతాలలో ఉంది. శ్రీ పరమహంస యోగానందగారి ఒక యోగి ఆత్మ కథ నుండి పునశ్చరణ – స్వామి ప్రణవానందగారు, తాను తిరిగి జన్మించిన తరువాత, బద్రినారాయణ్ కి (బద్రీనాథ్ దగ్గర) వెళ్ళి అక్కడ మహావతార్ బాబాజీ చుట్టూ ఉండే సాధుమహాత్ములతో చేరారు.

ఇతరులతో పంచుకోండి